సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిల్‌లో దొమ్మరాజు గుకేష్ సంచలనం సృష్టించాడు. చైనా ఆటగాడు డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి చిన్న వయస్సులోనే (18) ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. ఈ నేపథ్యంలో యువ కెరటం గుకేష్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వారు ట్వీట్ చేశారు. ‘‘ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించిన గుకేష్‌కు హృదయపూర్వక అభినందనలు… మన దేశం గర్వపడేలా చేశాడు’’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
గేకేష్ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుంది : ప్రధాని మోదీ
గుకేశ్ విజయం చారిత్రాత్మకమని.. ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గుకేష్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడని ప్రశంసించారు. అతడి అసమాన ప్రతిభ, కృషి, పట్టుదలకు ఫలితమే ఈ విజయం అని అన్నారు.
కాగా, చెస్‌కు, భారత్‌కు, డబ్ల్యుసీఏకు, తనకూ ఇది గర్వించదగ్గ విషయమని మాజీ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ పేర్కొన్నారు.
తెలుగబ్బాయి గుకేశ్‌కు శుభాకాంక్షలు : చంద్రబాబు…
అతిపిన్న వయస్సులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 18 ఏళ్లకే ప్రపంచ చదరంగ ఛాంపియన్‌గా అవతరించిన మన తెలుగబ్బాయి, ఇండియన్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌కు హృదయ పూర్వక అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
లోకేష్ ట్వీట్..
భారత సరికొత్త చెస్ ఛాంపియన్, మన తెలుగు వాడు గుకేశ్‌కు అభినందనలు అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడని కొనియాడారు. ఈ టైటిల్ గెలుచుకున్న రెండో భారతీయుడని, గుకేశ్ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. మీ విజయాన్ని చూసి భారత్ గర్విస్తోందని లోకేశ్ రాసుకొచ్చారు.