భారత యువ గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్ కొత్త చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్లకే ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకుని గుకేశ్ కొత్త ఘనత సాధించాడు. అత్యంత పిన్న వయసులోనే క్యాండిడేట్స్ విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా కొత్త రికార్డు నమోదు చేశాడు. దాంతో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్ చాలెంజర్‌గా నిలిచిన మొదటి టీనేజర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
మరోవైపు భారత్ తరఫున చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టైటిల్ గెలుచుకున్న రెండో ప్లేయర్‌గా కూడా రికార్డుల్లో నిలిచాడు. ఇక ఈ ఏడాది జరిగే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరులో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో గుకేశ్ ఢీ కొనేందుకు సిద్ధమయ్యాడు. అందులోనూ గెలిస్తే మరో కొత్త చరిత్ర ఖాయం.
సోమవారం జరిగిన చివరి 14వ రౌండ్లో గుకేశ్ అమెరికాకు చెందిన హికారు నకమురాతో డ్రా చేసుకున్నాడు. దీంతో అతడి ఖాతాలో 9 పాయింట్లు చేరాయి. 14 రౌండ్లు పూర్తయ్యే సరికి అత్యధిక (9) పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచిన గుకేశ్ విజేతగా నిలిచాడు.
అంతకుముందు జరిగిన కీలకమైన 13వ రౌండ్లో తెలివిగా ఆడిన గుకేశ్.. అలీరెజాపై అద్భుత విజయం సాధించి సోలోగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు గుకేశ్‌తో టైటిల్ పోరులో నిలబడిన ఇయాన్ నెపోమ్నియాషి (రష్యా), ఫాబియానో కరువానా (అమెరికా) మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది.
చివరి రౌండ్ ముగిసేసరికి వీరిద్దరూ చెరో 8.5 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఫాబియానో కరువానా (8) మూడో స్థానంలో నిలిచాడు. భారత ఇతర గ్రాండ్‌మాస్టర్లు ఆర్ ప్రజ్ఞానంద (7 పాయింట్లు) ఐదు, విదిత్ గుజరాతీ (6 పాయింట్లు) ఆరో స్థానాలతో సరిపెట్టుకున్నారు.
ఆనంద్ తర్వాత రెండో ప్లెయర్గా..
భారత మాజీ దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ చెస్ టైటిల్ గెలిచిన రెండో భారతీయుడిగా గుకేశ్ రికార్డుల్లో నిలిచాడు. 2014లో ఆనంద్ ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత గుకేశ్ భారత్‌కు రెండో టైటిల్ అందించాడు. పిన్న వయసులోనే మేజర్ టైటిల్ గెలిచిన డి గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు.. చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తదితరులు గుకేశ్‌కు అభినందనలు తెలియజేశారు.
హంపీ, వైశాలిలకు రెండో స్థానం..
మహిళల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపీ, ఆర్ వైశాలిలు చెరో 7.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి టోర్నీను ముగించారు. సోమవారం జరిగిన చివరి రౌండ్లో యువ గ్రాండ్ మాస్టర్ వైశాలి వరుసగా ఐదో విజయం సాధించి సంలచనం సృష్టించింది. 14వ రౌండ్ మ్యాచ్‌లో వైశాలి రష్యా క్రీడాకారిణి కాటెరినా లగ్నోను ఓడించగా.. హంపీ చైనా ప్లేయర్ లీ టింగ్జీతో డ్రా చేసుకుంది. మహిళల విభాగంలో 9 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచిన చైనా గ్రాండ్‌మాస్టర్ టాన్ జొంగ్యీ టైటిల్ కైవసం చేసుకుంది.