ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు, ఒలింపిక్ విజేత సైనా నెహ్వాల్ కూడా సాధించని ఫీట్‌ను తస్నిం మీర్ అందుకుంది. భారతీయ బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం విడుదలైన అండర్-19 బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో తస్నిం.. ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచింది. 16 ఏళ్ల తస్నిం.. బీడబ్ల్యూఎఫ్ అండర్-19 మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించింది. తొలి భారతీయ షట్లర్‌గా రికార్డు సృష్టించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతోనే ప్రపంచ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. జూనియర్ లెవల్‌లో సైనా, సింధు ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. 10,810 పాయింట్లతో తస్నిం టాప్‌లో నిలిచింది. గుజరాత్‌కు చెందిన తస్నిం.. తండ్రి పోలీస్ శాఖలో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తారు.
జూనియర్ ఇంటర్నేషనల్ లెవల్‌లో నాలుగు ట్రోఫీలు సాధించింది. అండర్ 19 బాలుర విభాగంలో లక్ష్యసేన్, సిరిల్ వర్మ, ఆదిత్య జోషీలు ప్రపంచ నెంబర్ 1 స్థానంలో నిలిచారు. కానీ బాలికల విభాగంలో ఎవరూ ఈ స్థాయికి రాలేదు. పీవీ సింధు 2వ స్థానం వరకు వచ్చింది. ఈ సందర్భంగా తస్నిం ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. తన తండ్రి కూడా బ్యాడ్మింటన్ కోచ్ అని, మేషానా పోలీస్ విభాగంలో ఏఎస్‌ఐగా కూడా విధులు నిర్వహిస్తారన్నారు. 7-8 ఏళ్ల వయస్సులో.. తండ్రితో పాటు తానూ ఆడేందుకు వెళ్లేదని చెప్పుకొచ్చింది. గుజరాత్ స్టేట్ జూనియర్ ఛాంపియన్ మహ్మద్ అలీ మీర్ చెల్లెలే తస్నిం మీర్. అండర్ 13, 15, 19లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించింది. గుజరాత్ డీజీపీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital