Saturday, November 23, 2024

శ్రీ‌లంక‌పై అద్భుత విజ‌యం.. టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌, 222 ప‌రుగులతో భార‌త్ గెలుపు

శ్రీ‌లంక‌తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంకతో మొహాలీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టెస్టు క్రికెట్‌లో రికార్డు అనే చెప్పొచ్చు. ఇన్నింగ్స్​, 222 పరుగుల విజయాన్ని టీమిండియా సొంతం చేసుకుంది. తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్లు అదరగొట్టారు. వీరి ధాటికి శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్సులో 178 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (175 నాటౌట్), రిషభ్ పంత్ (96), రవిచంద్రన్ అశ్విన్ (61), హనుమ విహరి (58), విరాట్ కోహ్లీ (45) రాణించడంతో 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. బ్యాటింగ్‌కు దిగిన లంకేయులను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్సులో లంక జట్టు 174 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్‌లో పడింది. ఫాలో ఆన్‌లో కూడా జడేజా 4, అశ్విన్ 4 వికెట్లతో చెలరేగారు. వీరికి మహమ్మద్ షమీ 2 వికెట్లతో జత కలిశాడు.

భారత బౌలర్లను లంక బ్యాటర్లు ఏమాత్రం ఎదుర్కోలేకపోయారు. నిరోషన్ డిక్కవెల్ల (51 నాటౌట్) మాత్రమే ఫర్వాదలేదనిపించాడు. మిగతా వాల్లంతా 30 పరుగుల లోపు స్కోర్లకే పెవిలియన్ చేరడంతో రెండో ఇన్నింగ్సులో శ్రీలంక 178 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం నమోదు చేసింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

కాగా, ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా తొలుత బ్యాటింగ్‌తో 175 పరుగులు చేశాడు. తర్వాత బంతితో 41 పరుగులకే 5 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో జడేజాకి ఇది రెండో సెంచరీ. కాగా, బంతితో 10వ సారి 5 వికెట్లు పడగొట్టాడు. సొంతగడ్డపై 8వ సారి 5 వికెట్లు పడగొట్టి లెఫ్టార్మ్ బౌలర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ విషయంలో బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న భారత రికార్డును సమం చేశాడు.

60 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా, ఒక ఆటగాడు టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడిగా జడేజా నిలిచాడు. భారత క్రికెట్‌లో తొలిసారిగా 1952లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో వినూ మన్కడ్ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత 1962 సంవత్సరంలో, పాలీ ఉమ్రిగర్ ఆ ఫీట్‌ను పునరావృతం చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఇక, 60 ఏళ్ల తర్వాత జడేజా ఈ జాబితాలో మూడో ఆటగాడిగా చేరాడు.

సొంతగడ్డపై బిషన్ సింగ్ బేడీ రికార్డును బంతితో సమం చేసిన జడేజా..
మొహాలీలో బ్యాట్‌తో కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం టెస్టుల్లో 7వ ర్యాంక్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచిన జడేజా.. టెస్టు క్రికెట్‌లో 36.46 సగటును కలిగి ఉన్నాడు. బౌలింగ్‌లో అతని సగటు 24.50గా నిలిచింది. ఈ రెండు గణాంకాలు జడేజాను గొప్ప ఆల్ రౌండర్‌గా మార్చడానికి సరిపోతాయనడంలో సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement