కాబూల్, జలాలాబాద్ వీధులలోకి లక్షలాది మంది జనం
అప్ఘన్ చరిత్రలో కనీ విని ఎరుగని ఆనందోత్సవం
తమ జట్టు విజయంతో పులకించిపోయిన కోట్లాది మంది
టి 20 వరల్డ్ కప్ లో తొలిసారి సెమీస్ కు అప్ఘనిస్థాన్ చేరడంతో ఆ దేశ ప్రజలు పులకించిపోయారు.. నిత్యం తుపాకీ మోతలతో దద్దరిల్లే దేశంలో ఒక్కసారిగా వెలుగు రేఖలు ప్రసవించాయి.. పరదాలు , కట్టు బాట్లు, ఆంక్షలు ధిక్కరించి లక్షలాది ప్రజలు వీదులలోకి దూసుకొచ్చారు… తమ జట్టుకు కోట్లాది జనం కేరింతలతో, పటాసులతో శుభాకాంక్షలు తెలిపారు..
కాగా, ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో పసికూన అనుకున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇప్పుడు కొరకరాని కొయ్య. ఆఫ్ఘన్ దెబ్బకు టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లకు ఆ విషయం బాగా అర్థమై ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇవాళ బంగ్లాదేశ్ పై చారిత్రాత్మక విజయం సాధించి తొలిసారిగా ఓ వరల్డ్ కప్ లో సెమీస్ చేరింది. కల్లోలభరిత పరిస్థితులకు చిరునామాగా నిలిచే ఆఫ్ఘనిస్థాన్ లో ఈ విజయం సంతోషాల జల్లు కురిపించింది. రషీద్ ఖాన్ సేన సృష్టించిన చరిత్ర స్వదేశంలో ఆఫ్ఘన్లను వీధుల్లోకి వచ్చి నాట్యం చేయించింది.
రాజధాని కాబూల్, జలాలాబాద్ వంటి ముఖ్య నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చి తమ క్రికెట్ జట్టు సాధించిన ఘనత పట్ల సంబరాలు జరుపుకున్నారు. ఇసుకేస్తే రాలనంతగా జనాలతో ప్రధాన కూడళ్లు నిండిపోయాయి. తాలిబన్ పాలనలో ఉన్న ఆఫ్ఘన్ లో ఇలాంటి దృశ్యాలు కలలో కూడా ఊహించలేం. కానీ, వారి క్రికెట్ జట్టు హేమాహేమీ జట్లను ఓడించి, వరల్డ్ కప్ సెమీస్ బెర్తును సాధించడం ప్రజల సంబరాలకు కారణమైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆఫ్ఘన్ ఆటగాళ్లు వేడుకలు, స్వదేశంలో వారి అభిమానుల సంబరాల తాలూకు ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి.
రషీద్ ఖాన్ కు విదేశాంగ మంత్రి అభినందనలు …
బంగ్లాతో మ్యాచ్ గెలవగానే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ అభినందించారు. ఏకంగా రషీద్ గ్రౌండ్‌లో ఉండగానే వీడియో కాల్ చేసి చాలాబాగా ఆడారంటూ ఆటగాళ్లలో నూతనోత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో పోస్ట్ ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.