Monday, November 25, 2024

Grand Welcome | హాకీ జ‌ట్టుకు ఘ‌న స్వాగ‌తం…

పారిస్ ఒలింపిక్స్‌లో సత్తాచాటి కాంస్య ప‌త‌కం గెలిచిన‌ భారత పురుషుల హాకీ జట్టు శనివారం ఉద‌యం స్వ‌దేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే అభిమానులు భారీ సంఖ్యలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంత‌ర్జాతీయ‌ విమానాశ్రయానికి చేరుకొని ఆట‌గాళ్ల‌కు ఘన స్వాగతం పలికారు.

కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్‌, గోల్ కీప‌ర్ శ్రీజేశ్‌, మాజీ సార‌థి మ‌న్‌ప్రీత్ సింగ్‌తో పాటు ఇత‌ర ప్లేయ‌ర్ల‌కు మెడ‌లో పూల‌దండ‌, రుమాలు వేసి అధికారులు గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు. దీంతో జ‌ట్టులోని ప్రతి స‌భ్యుడు, సిబ్బంది ఆనందంగా, ఉల్లాసంగా క‌నిపించారు. అలాగే కొంద‌రు ఆట‌గాళ్లు బ్యాండ్ చప్పుళ్లకు హుషారుగా తీన్మార్‌ స్టెప్పులేయ‌డం కూడా చేశారు.

కాగా, గురువారం స్పెయిన్ తో జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా సత్తాచాటింది. ఈ మ్యాచ్లో 2-1తేడాతో భారత జట్టు నెగ్గి కాంస్య ప‌త‌కం దక్కించుకుంది. 1968లో మెక్సికో సిటీలో జరిగిన ఒలింపిక్స్, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండు కాంస్య పతకాలను సాధించిన భారత హాకీ జట్టు.. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు కాంస్య పతకాలు సాధించడం ఇది రెండోసారి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా టీమిండియా కాంస్యంతో మెరిసిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement