మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళల జట్లు.. 44 పరుగులుకే కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు వచ్చినవారు వచ్చినట్లు పెవిలియన్ దారిపట్టారు.
కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. అసాబి కలెండర్ (12), కెనికా కసర్ (15) మాత్రమే కాసేపు పోరాడారు. టీమిండియా బౌలర్లలో సిసోడియా 3, ఆయుషి శుక్లా 2, జోషిత 2 వికెట్లు తీశారు.
స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన యువ భారత్… 4.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. టీం ఇండియా బ్యాటింగ్‌లో కమిలిని (16), సానికా చాల్కే (18) అజేయంగా నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.