కోబ్ (జపాన్): జపాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. మంగళవారం జరిగిన పోటీల్లో జావెలిన్ త్రోలో భారత స్టార్ పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ స్వర్ణ పతకం సాధించగా.. సందీప్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు హై జంప్‌లో మరియప్పన్ థంగవేలు పడిసిడిని కైవసం చేసుకున్నాడు.
పురుషుల విభాగం ఎఫ్-64 జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్స్‌లో సుమిత్ తన జావెలిన్‌ను 69.50 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో సందీప్ (60.41మీ) ప్రదర్శనతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. శ్రీలంక అథ్లెట్ దులన్ కొడితువాకు (66.94మీ) సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు.
గతేడాది జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో సుమిత్ బళ్లెంను 73.29 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డుతో పాటు గోల్డ్ మెడల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరిగిన పురుషుల హై జంప్ టీ-63 ఈవెంట్ ఫైనల్లో మరియప్పన్ థంగవెలు 1.88 మీటర్ల దూరం దూకి భారత్‌కు నాలుగో స్వర్ణ పతకాన్ని అందించాడు.
అమెరికాకు చెందిన ఎజ్రా ఫ్రెచ్ (1.85మీ) రజతం, సామ్ గ్రీవ్ (1.82మీ) కాంస్య పతకాలు దక్కించుకున్నారు. దాంతో ఈ మెగా టోర్నీలో భారత్‌కు నాలుగు బంగారు పతకాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో మన అథ్లెట్లు మెరుగైన ప్రదర్శనలు చేస్తుండటంతో ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. చైనా 15 స్వర్ణాలతో తొలి స్థానంలో కొనసాగుతుండగా.. బ్రెజిల్ 14 బంగారు పతకాలతో రెండో స్థానంలో ఉంది.