ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆదివారం జరిగిన పోరులో అమెరికా టెన్నిస్‌తార కోకో గాఫ్, పోలాండ్ భామ ఇగా స్వియాటెక్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇటలీకి చెందిన ఎలిసబెట్టా కొకియారెట్టోపై 6-1, 6-2 తేడాతో గాఫ్ విజయం సాధించింది. తద్వారా 21 ఏళ్లు నిండకముందే ఓపెన్ ఎరాలో వరుసగా నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన మొదటి అమెరికన్ మహిళగా నిలిచింది. ఫిలిప్ చాట్రియర్ క్లే కోర్టుపై అమెరికన్ మూడవ సీడ్ తన అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన కనబరిచింది. గాఫ్ తదుపరి పోరులో ఓన్స్ జబీర్ లేదా క్లారా టౌసన్‌తో తలపడనుంది.
స్వియాటెక్ ఏకపక్ష విజయం..
కాగా, మరొక మ్యాచ్‌లో రష్యాకు చెందిన అనస్తాసియా పొటాపోవాపై 6-0, 6-0 స్కోరుతో ఏకపక్ష విజయాన్ని అందుకున్న స్వియాటెక్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కేవలం 40 నిముషాల్లోనే గేమ్‌ను ముగించింది. కోర్ట్ ఫిలిప్-చాట్రియర్‌లో జరిగిన నాల్గవ రౌండ్‌లో పోలాండ్ భామ అదరగొట్టింది. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్‌లో స్వియాటెక్ ఐదో సీడ్ మార్కెటా వొండ్రూసోవాతో తలపడుతుంది.
బొపన్నజోడీ శుభారంభం..
బ్రెజిలియన్ జంట ఓర్లాండోలూజ్, మార్సెలో జోర్మాన్‌పై రోహన్ బొపన్న జోడీ శుభారంభం చేసింది. ఆస్ట్రేలియన్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీని విజయంతో ప్రారంభించారు. ఉత్కంఠభరితంగా సాగిన తొలిరౌండ్ పోరులో రెండో సీడ్ జోడీ 7-5, 4-6, 6-4 తేడాతో విజయం సాధించింది. వీరి ప్రారంభ మ్యాచ్ వర్షంతో వాయిదా పడినందున బొపన్న-ఎబ్డెన్ రోలాండ్ గారోస్ ప్రయాణం ట్విస్ట్‌తో ప్రారంభమైంది.