భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది శతకాల మోత మోగిస్తున్నాడు. బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌తో మొదలైన గిల్ సెంచరీల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కెరీర్లోనే సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ ఇవ్వాల (ఆదివారం) ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సెంచరీ కొట్టాడు.
తనదైన శైలిలో బంతులను బౌండరీలకు బాదుతూ కంగారూలను ఉతికారేసిన శుభ్‌మన్.. ఆస్ట్రేలియా బౌలర్ సియాన్ అబాట్ ఓవర్లో సింగిల్ తీసి 100కు చేరువయ్యాడు. దాంతో ఈ యంగ్‌స్టర్ వన్డే ఫార్మాట్లో ఆరో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియా తరఫున తక్కువ (35) ఇన్నింగ్స్‌లలోనే గిల్ ఆరో సెంచరీ బాదడం విశేషం. అంతేకాదు 50 ఓవర్ల ఆటలో ఒకే ఏడాది 5 సెంచరీలు కొట్టిన ఏడో భారత బ్యాటర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. గిల్ కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, శిఖర్ ధావన్ ఈ ఫీట్ సాధించిన వారిలో ఉన్నారు.