Monday, October 7, 2024

IND vs ZIM | వాళ్లొచ్చారు… గిల్‌కు కొత్త త‌ల‌పోటు

జింబాబ్వే, ఇండియా జట్ల మధ్య మూడో టీ20 హరారే వేదికగానే బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా తుది జట్టు ఎంపిక శుభ్‌మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు తలనొప్పిగా మారింది. టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో భాగమైన యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్‌లు భారత జట్టులోకి అందుబాటులోకి రానున్నారు.

టీ20 ప్రపంచకప్ 2024 సంబరాల నేపథ్యంలో ఈ ముగ్గురికి జింబాబ్వే పర్యటనలోని తొలి రెండు టీ20ల నుంచి విశ్రాంతి కల్పించింది. ఈ ముగ్గురి స్థానాల్లో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలను తాత్కలికంగా ఎంపిక చేసింది. చివరి మూడు టీ20లకు శివమ్ దూబే, సంజూ శాంసన్, యశస్విజైస్వాల్ అందుబాటులోకి రావడంతో సాయి సుదర్శన్, హర్షిత రాణా, జితేశ్ శర్మ జట్టును వీడనున్నారు.

సీనియర్లుగా అందుబాటులోకి వచ్చే ఈ ముగ్గురిని తుది జట్టులోకి తీసుకోవడం శుభ్‌మన్ గిల్, లక్ష్మణ్‌లకు సవాల్‌గా మారింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగడం.. రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో తదుపరి మ్యాచ్‌ల్లో వారిని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దాంతో యశస్వి జైస్వాల్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్థానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అరంగేట్ర మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో సంజూ శాంసన్‌కు మార్గం సుగుమమైంది.

రియాన్ పరాగ్ స్థానంలో శివమ్ దూబే బరిలోకి దిగే అవకాశం ఉండగా.. సాయి సుదర్శన్ స్థానంలో యశస్వి జైస్వాల్‌ను ఆడించవచ్చు. ఈ మార్పులు మినహా మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు బరిలోకి దిగనున్నారు.

- Advertisement -

ఫినిషర్‌గా రింకూ సింగ్ ఆడనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్, స్పెషలిస్ట్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కొనసాగనున్నాడు. పేసర్లుగా ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్‌లతో కలిసి శివమ్ దూబే పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం ప్రపంచకప్ విజేతలు ముగ్గురూ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

జింబాబ్వేతో మూడో టీ20కి భారత తుది జట్టు(అంచనా)

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్/శివమ్ దూబే, రింకూ సింగ్, సంజూ శాంసన్/ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

జింబాబ్వేతో చివరి మూడు టీ 20లకు భారత జట్టు:

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే.

Advertisement

తాజా వార్తలు

Advertisement