సింగపూర్: ప్రతిష్టాత్మకమైన సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రిసా జాలీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో గాయత్రి-ట్రిసా జంట 21-23, 11-21 తేడాతో జపాన్‌కు చెందిన నాలుగో సీడ్ నమీ మత్సుయమా-చిహరు షిడా ద్వయం చేతిలో పోరాడి ఓడారు.
హోరాహోరిగా జరిగిన తొలి గేమ్‌లో భారత జంట ప్రత్యర్థి జంటకు చుక్కలు చూపెట్టింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మొదటి గేమ్‌లో చివరి నిమిషంలో దూకుడు పెంచిన నాలుగో సీడ్ జపాన్ జోడీ టై బ్రేకర్‌లో గెలిచింది. ఇక రెండో రౌండ్‌లో గాయత్రి జంట పూర్తిగా తేలిపోయింది. దాంతో సింగపూర్ ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసింది.
ఇక ఈ టోర్నీలో గాయత్రి-ట్రిసా జోడీ చిరస్మరణీయ ప్రదర్శనలతో ఆకట్టుకుంది. ఒలింపిక్స్ మెడలిస్ట్ సింధు, పురుషుల డబుల్స్ వరల్డ్ నెం.1 జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టిలు, హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ వంటి స్టార్ షట్లర్లు వరుసగా విఫలమై ఆరంభంలోనే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. గాయత్రి-ట్రిసా మాత్రం వరుస విజయాలతో అందరి దృష్టి ఆకర్షించారు.
వీరిద్దరూ ప్రి క్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ దక్షిణ కొరియా జంటపై సంచలన విజయంతో అదరగొట్టింది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ పోరులో ఆరో సీడ్ హాంకాంగ్ జంటను ఓడించి సత్తా చాటుకుంది. దాంతోపాటు తొలిసారి సూపర్ సిరీస్ టోర్నీలో సెమీఫైనల్లో ప్రవేశించి కొత్త రికార్డు నమోదు చేశారు.