Tuesday, October 8, 2024

Gautam Gambhir | ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డేలా చేస్తా..

టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ని బీసీసీఐ నియమించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్ వేదికగా మంగళవారం వెల్లడించారు. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీరే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ఆది నుంచే ప్రచారం సాగింది. కానీ బీసీసీఐ అడ్వైజరీ కమిటీ మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్‌ను కూడా ఇంటర్వ్యూకు ఆహ్వానించింది.

అయితే కోచ్‌గా అనుభవం లేనప్పటికీ గంభీర్‌కే బీసీసీఐ కోచ్ పదవిని కట్టబెట్టింది. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజేత అయిన గంభీర్ ఐపీఎల్‌లో సక్సెఫుల్ కెప్టెన్‌గానే కాకుండా మెంటార్‌గా ఘనత సాధించాడు. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో మెంటార్‌గా గంభీర్‌ది కీలకపాత్ర. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ దూకుడు ఫార్ములాతో జట్టును సిద్ధం చేయడంలో గంభీర్ నేర్పరి.

అయితే తానే కోచ్‌ అని బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన అనంతరం గౌతమ్ గంభీర్ సోషల్ మీడియా వేదికగా తన అనూభూతిని పంచుకున్నాడు. భావోద్వేగంతో పోస్ట్ చేశాడు. భారతదేశమే తన గుర్తింపు అని, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయడమే తన లక్ష్యమని గంభీర్ అన్నాడు. దాని కోసం టీమిండియాతో కలిసి శాయశక్తులా ప్రయత్నిస్తాని చెప్పాడు.

- Advertisement -

”భారతదేశం నా గుర్తింపు. దేశానికి సేవ చేయడం నా అదృష్టం. ఇతర టోపీలు ధరించినప్పటికీ తిరిగి వచ్చినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నా. కానీ నా లక్ష్యం ఎప్పటిలానే, ప్రతి భారతీయున్ని గర్వపడేలా చేయడమే. 140 కోట్ల మంది కలలను బ్లూ జెర్సీ ధరించి భారత జట్టు మోస్తుంటుంది. నేను శాయశక్తులా ప్రయత్నించి ఆ కలలను సాకారం చేసేలా ప్రయత్నిస్తాను” అని గౌతమ్ గంభీర్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

కాగా, ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న శ్రీలంక సిరీస్‌తో గంభీర్ కోచ్‌గా యాక్షన్‌లోకి దిగనున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కోచ్ పదవిలో ఉంటాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అలాగే 2025లోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉంటుంది. 2026లో టీ20 వరల్డ్ కప్, ఆ తర్వాత వన్డే మహా సమరం జరుగుతాయి. ఈ నాలుగు టైటిళ్లు లక్ష్యంగా గంభీర్ కోచ్‌గా బరిలోకి దిగుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement