Friday, November 22, 2024

Gautam Gambhir | కోహ్లీ, రోహిత్ లు ఆడుతూనే ఉంటారు…

టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారిగా మీడియా సమావేశానికి హాజరయ్యాడు. గంభీర్‌తో పాటు టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రవీంద్ర జడేజాను ఎందుకు ఎంపిక చేయలేదో వివరణ ఇచ్చారు.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఎప్పటివరకు భారత జట్టులో తప్పక కొనసాగుతారో నయా కోచ్ గంభీర్ తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ విజయానంతరం స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. 35 ఏళ్ల కోహ్లి, 37 ఏళ్ల రోహిత్.. టీ20లకు మాత్రమే వీడ్కోలు అని, వన్డే, టెస్టులకు అందుబాటులో ఉంటామని చెప్పారు.

అయితే వారిద్దరు ఎప్పటివరకు జట్టులో కొనసాగుతారనే ఆందోళన అభిమానుల్లో కొనసాగింది. దశాబ్ద కాలంపాటు భారత్ బ్యాటింగ్‌కు మూలస్తంభాలుగా నిలిచిన వారిద్దరు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఈ స్టార్లకు వారసులెవరో నిర్ణయించుకుండానే వన్డే, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే భారత క్రికెట్‌పైనే ప్రభావం చూపుతుందని క్రికెట్ విశ్లేషుకులు, అభిమానులు ఆందోళన చెందారు.

అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న వరల్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు కోహ్లి-రోహిత్ తప్పక అందుబాటులో ఉంటారని గంభీర్ స్పష్టం చేశాడు. అంతేగాక ఫిట్‌నెస్ కాపాడుకుంటే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కూడా వారిద్దరు భారత జట్టులోనే కొనసాగుతారని గంభీర్ అన్నాడు.

”విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మరికొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడతారు. వారిద్దరు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు. ఏ జట్టు అయినా వారిద్దరు కొనసాగాలనే కోరుకుంటుంది. ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఉంది. ఆ తర్వాత వెంటనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. వారిద్దరు ఫిట్‌నెస్ కాపాడుకుంటే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు తప్పక ఆడతారు” అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.

- Advertisement -

కోచ్‌గా ఎంపికైన తర్వాత విరాట్ కోహ్లికి మెసేజ్ చేశానని, అతనితో తనకి మంచి సంబంధమే ఉందని గంభీర్ అన్నాడు. కోహ్లితో కలిసి జట్టుకు విజయాలు అందించడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ మెగాటోర్నీకి జట్టుకూర్పు గురించి ఓ ప్రణాళిక రావాలని.. విశ్రాంతి తీసుకోవాలని భావించిన కోహ్లి, రోహిత్‌లను సైతం లంక వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు.

కానీ జడేజాను మాత్రం పక్కనపెట్టారు. దీంతో జడేజాను పక్కనపెట్టారని, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను స్పిన్ ఆల్‌రౌండర్లుగా జట్టులో కొనసాగించాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే జడేజాను తప్పించలేదని సెప్టెంబర్ నుంచి కీలక టెస్టు సిరీస్‌లు మొదలుకానున్న నేపథ్యంలో విశ్రాంతి ఇచ్చామని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లకు ఎంపిక చేయనంత మాత్రాన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలో జడేజా లేనట్లు కాదని గంభీర్ అన్నాడు.

మరోవైపు అజిత్ అగార్కర్ మాట్లాడుతూ..సుదీర్ఘ టెస్టు షెడ్యూల్ ఉందని, అందుకే జడేజాకు విశ్రాంతి ఇచ్చామని అన్నాడు. అయితే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాను ఇద్దరినీ ఎంపిక చేయలేమని, ఇద్దరిలో ఒకరు బెంచ్‌రే పరిమితం కావాల్సి ఉంటుందని అగార్కర్ పేర్కొన్నాడు.

స్వదేశంలో బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌లతో భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ నుంచి ఆస్ట్రేలియాలో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement