దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లీ బీసీసీఐ చీఫ్ గంగూలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. కోహ్లీకి దాదా షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్లు జాతీయ మీడియాలో గురువారం కథనాలు వెలువడ్డాయి. కోహ్లీని టీ20 కెప్టెన్సీ వీడొద్దని వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేశానని గంగూలీ మీడియాకు స్వయంగా తెలిపాడు. అయితే అనంతరం కోహ్లీ సఫారీలతో సిరీస్‌కు ముందు తనను ఎవరూ కెప్టెన్సీ వీడొద్దని చెప్పలేదని మీడియాకు బాహాటంగానే తెలిపాడు. దీనిపై స్పందించిన గంగూలీ.. కోహ్లీ వ్యాఖ్యలపై చర్యలు ఉండవని బోర్డు చూసుకుంటుందని చెెప్పాడు. ఆ తర్వాత సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్‌శర్మ కూడా కోహ్లీ కెప్టెన్సీపై గంగూలీ చెప్పిన విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శనతో 2-1తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. తొలి వన్డేలోనూ ఆతిథ్య ప్రొటీస్ ముందు తేలిపోయింది.
ఇక నేడు జరిగే రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైతే వన్డే సిరీస్ కూడా దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంటుంది. ఈక్రమంలో టీమిండియా ప్రక్షాళన తప్పదని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్రధానంగా రహానె, పుజారా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. మరోవైపు టెస్టు కెప్టెన్సీ నుంచి అనూహ్యంగా తప్పుకున్న కోహ్లీకి కూడా షోకాజ్ నోటీసులు జారీ అవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కాగా 2021 టీ20 ప్రపంచకప్ అనంతరం కోహ్లీ టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత గత డిసెంబర్‌లో బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించి రోహిత్‌శర్మను సారథిగా ప్రకటించింది. ఇక టెస్టు కెప్టెన్‌గా కొనసాగిన కోహ్లీ గత శనివారం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత సారథిగా తప్పుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించి కలకలం రేపాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..