విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ (70 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో కోల్‌కతా జట్టు ఘనవిజయం సాధించింది. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యం ముందున్నప్పటికీ.. కేకేఆర్ టాపార్డర్ విఫలమైంది. ఎవరూ నిలకడగా రాణించలేకపోయారు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రస్సెల్ తన బ్యాటుతో విరుచుకుపడి తనేంటో నిరూపించుకున్నాడు. అంతకుముందు పంజాబ్ బ్యాటింగ్ సమయంలో 19వ ఓవర్ వేసేందుకు వచ్చిన అతను.. తొలి బంతికే వికెట్ తీశాడు. ఆ తర్వాతి బంతికి అర్షదీప్ రనౌట్ అవడంతో పంజాబ్ కథ ముగిసింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో కూడా రహానే (12), వెంకటేశ్ అయ్యర్ (3) మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (26) ఉన్నంతసేపు మంచి షాట్లు ఆడాడు. కానీ చాహర్ బౌలింగ్‌లో బంతిని సరిగా అంచనా వేయలేక అవుటయ్యాడు.
ఆ వెంటనే నితీష్ రాణా (0) కూడా పెవిలియన్ చేరడంతో కేకేఆర్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో మరో వికెట్ పడకుండా శామ్ బిల్లింగ్స్ (24 నాటౌట్) జాగ్రత్తగా ఆడాడు. అతనికి జత కలిసిన రస్సెల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభంలో కొంత నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత గేరు మార్చి రెచ్చిపోయాడు. అతని ధాటికి 14.3 ఓవర్లలోనే కోల్‌కతా విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో చాహర్ 2 వికెట్లు తీయగా.. రబాడ, ఒడియన్ స్మిత్ చెరో వికెట్ తీసుకున్నారు.