భారత జట్టు కొత్త హెడ్ కోచ్ నియామకానికి సమయం ఆసన్నమైంది. ముందునుంచి ఊహించినట్టుగానే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలో గౌతీ పాల్గొన్నాడు. జూమ్ కాల్ ద్వారా జరిగిన ఇంటర్వ్యూలో సీఏసీ ఛైర్మన్ అశోక్ మల్హోత్రాతో పాటు సభ్యులు జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్‌లు గంభీర్‌తో మాట్లాడారు. ఇంటర్వ్యూలో భాగంగా నిన్న ఓ రౌండ్ ముగియగా.. నేడు ఇంకో రౌండ్ ఉంది.
టీమిండియా హెడ్ కోచ్‌గా వచ్చే 2-3 ఏళ్లకు తన ప్రణాళికలను సీఏసీ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ ప్రెజెంటేషన్ ఇస్తున్నట్లు సమాచారం. రెండో రౌండ్ పూర్తయ్యాక గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా ప్రకటించే అవకాశముంది. కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వారిలోంచి గంభీర్‌తో పాటు డబ్ల్యూవీ రామన్‌ను కూడా సీఏసీ ఇంటర్వ్యూ చేసింది. రామన్‌కు కూడా నేడు మరో రౌండ్ ఇంటర్వ్యూకి హాజరవుతారట. అయితే గంభీర్‌నే టీమిండియా హెడ్ కోచ్‌గా చేయడానికి బీసీసీఐ ఆసక్తితో ఉందని సమాచారం.