ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బెలారస్ స్టార్ సబలెంక బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సబలెంక 6-1, 6-2తో ఎరికా అండ్రీవా(రష్యా)పై అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. గంటా ఎనిమిది నిమిషాల పాటు సాగిన పోరులో సబలెంక తనదైన ఆధిపత్యం ప్రదర్శించింది.
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకున్న సబలెంక..మాడ్రిడ్, రోమ్‌లో జరిగిన క్లే కోర్టు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు ఎలీనా రిబకినా 6-2, 6-3తో గ్రీట్ మినెన్(బెల్జియం)పై గెలిచి టోర్నీలో శుభారంభం చేసింది. మిగతా మ్యాచ్‌ల్లో బ్లింకోవా, స్ట్రెర్న్స్, రస్, మెర్టెన్స్, మాట్రిచ్, జెంగ్, మాడిసన్ కీస్..ప్రత్యర్థులపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో మెద్వదెవ్ 6-3, 6-4, 5-7, 6-3తో కోఫెర్పై గెలువగా, మునార్ 6-1, 4-6, 6-4, 6-1తో బటిస్టాను ఓడించి తదుపరి రౌండ్లో నిలిచాడు.