Saturday, November 23, 2024

ఇవ్వాల్టి నుంచి ఫార్ములా – ఈ రేసుల ట్రయల్‌ రన్‌.. సాగ‌ర‌ తీరంలో దూసుకుపోనున్న రేస‌ర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫార్ములా- ఈ రేసుల ట్రయల్‌ రన్‌ను ఇవ్వాల‌,రేపు (శని, ఆది వారాల్లో) నిర్వహించనున్నారు. ఈ రేసులకు సంబంధించి హుస్సేన్‌ సాగర్‌ తీరాన ట్రాక్‌ పనులు, గ్యాలరీ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రేసుల ట్రయల్‌ రన్‌ కోసం ఇటలీ నుంచి రేసర్ల బృందం ఇప్పటికే నగరానికి చేరుకుంది. రేసుల కోసం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కులను శుక్రవారం నుంచే మూసివేశారు. ఈ మూసివేత 20వ తేదీ వరకు ఉంటుంది. తిరిగి 21వ తేదీన వీటిని తెరుస్తామని అధికారులు తెలిపారు.

రెన్యువబుల్‌ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌ కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫార్ములా రేసులను నిర్వహించనుంది. ఫార్ములా-ఇ అనేది ప్రపంచంలో ఎలక్ట్రిక్‌ సింగిల్‌ సీటర్‌ రేసింగ్‌ సిరీస్‌. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 9 నగరాల్లో ఈ పోటీలను నిర్వహించారు. ప్రస్తుతం ఈ పోటీలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమలకు రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే ఉద్దేశంతో రేసు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.

ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు…
ఫార్ములా ఈ రేసుల ట్రయల్‌ రన్‌ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను శనివారం నుంచి పూర్తిగా మళ్లించనున్నారు. ఖైరతాబాద్‌ జంక్షన్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ జంక్షన్‌, రవీంద్రభారతి జంక్షన్‌, మింట్‌ కాంపౌండ్‌, తెలుగు తల్లి జంక్షన్‌, నెక్లెస్‌ రోడ్డు, నల్లగుట్ట జంక్షన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ కట్టమైసమ్మ ఆలయం రూట్‌, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో వెళ్లవద్దని నగర ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement