ఆఫ్రికా దేశం గినియాలో ఘోరం జరిగింది. దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరెలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ రక్తసిక్తమైంది..
ఈ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 100 మందికిపైగా చనిపోయారు. గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్ సందర్భంగా రెఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారితీసింది. దీనిపై రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా చూస్తుండగానే తీవ్రస్థాయి ఘర్షణగా మారింది.
తొలుత రెఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ టీమ్ అభిమానులు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చారు. ఈక్రమంలో మరో జట్టు అభిమానులు కూడా అక్కడికొచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ రెండు వర్గాలు ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి మొదలుకొని, దాని చుట్టూ ఉండే వీధుల దాకా విస్తరించి మరీ కొట్టుకున్నారు.
కొందరు నేరుగా వెళ్లి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ హింసాకాండలో చనిపోయిన ఎంతోమంది డెడ్‌బాడీస్ స్టేడియంలో, చుట్టుపక్కనున్న వీధుల్లో పడి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.