టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు యూఎస్‌ఏ అద్భుతం చేసింది. ఆదివారం కెనడాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే రికార్డు లక్ష్య ఛేదనతో అదరగొట్టింది. కెనడా నిర్దేశించిన 195 పరుగులు లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలోనే ఛేదించింది. యూఎస్‌ఏ క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. వరల్డ్ కప్ చరిత్రలోనూ అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన మ్యాచ్‌లలో ఇది మూడవది.
తొలుత బ్యాటింగ్ చేసిన కెనడాకు ఓపెనర్లు మంచి పునాది వేశారు. ఆరోన్ జాన్సన్ (23), నవనీత్ (61) నిలకడగా ఆడారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో జాన్సన్‌తోపాటు పర్గత్ సింగ్ (5) ఔట్ అయ్యారు. ఆతర్వాత వచ్చిన నికోలస్ కిల్టన్ (51)తో కలిసి ఆరోన్ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు. వీరి జోడీ మూడవ వికెట్‌కు 62 పరుగులు జోడించడంతో కెనడా భారీ స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది. ఆఖర్లో శ్రేయస్ మొవ్వా (32) మెరుపు బ్యాటింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో కెనడా 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. యూఎస్‌ఏ అలీఖాన్, హర్మీత్‌సింగ్, సీజే అండర్సన్ తలో వికెట్ పడగొట్టారు.
195 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో యూఎస్‌ఏ ఖాతా తెరవకముందే వికెట్‌ను కోల్పోయింది. రెండవ బంతికే ఓపెనర్ స్టీవెన్ టేలర్ (0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపు పోరాడిన కెప్టెన్ మోనాంక్ పటేల్ (16) కూడా స్వల్పస్కోరుకే వెనుదిరిగాడు. ఇక్కడే యూఎస్‌ఏ బ్యాటర్లు అద్భుతం చేసిచూపించారు. ఆరోన్ జోన్స్ (94నాటౌట్-10సిక్స్‌లు, 4 ఫోర్లు), ఆండ్రిస్ గోస్ (65- 3సిక్స్‌లు, 7ఫోర్లు) కెనడా ఉత్సాహాన్ని నీరుగార్చారు.
ప్రత్యర్థి బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారీస్కోర్లు సాధించారు. వీరిద్దరు కలిసి మూడవ వికెట్‌కు అత్యంత విలువైన 131 (55బంతుల్లో) పరుగులతో జట్టు విజయానికి బాటలు వేశారు. ఆండ్రిస్ ఔటైనప్పటికీ కోరే అండర్సన్ (3) సహాయంతో జోన్స్ సునాయాసంగా జట్టును విజయతీరానికి చేర్చాడు. కెనడా బౌలర్లలో కలీం సనా, డిల్లాన్, నిఖిల్ దత్తా తలో వికెట్ సాధించారు.