Wednesday, July 3, 2024

T20WC | విండీస్ కు తొలి విజ‌యం… సూప‌ర్ 8 లో అమెరికాపై గెలుపు

టీ20 ప్రపంచకప్‌ 2024 సూపర్‌-8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. సూపర్‌-8 గ్రూప్-2లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఓడిన విండీస్ నేడు అమెరికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. యూఎస్ఏ నిర్ధేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని 10.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షాయ్ హోప్ (82 నాటౌట్; 39 బంతుల్లో 4×4, 8×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నికోలస్ పూరన్ 27 రన్స్‌తో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ విజయంతో విండీస్ సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉన్నాయి.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ 128 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఆడ్రిస్ గౌస్ (29) టాప్‌ స్కోరర్‌. నితీశ్‌కుమార్ (20), మిలింద్ కుమార్ (19), ఆరోన్ జోన్స్ (11) విఫలమయ్యారు. విండీస్‌ బౌలర్లలో ఆండ్రి రస్సెల్ 3, రోస్టన్ ఛేజ్ 3 వికెట్స్ తీయగా.. అల్జారీ జోసెఫ్‌ 2, మోతీ ఒక వికెట్ పడగొట్టారు. లక్ష్య ఛేదనలో విండీస్ బ్యాటర్ షై హోప్ విధ్వంసం సృష్టించాడు. బౌండరీల వర్షం కురిపించాడు. జాన్సర్‌ ఛార్లెస్‌ (15) ఎక్కువసేపు నిలవలేదు. నికోలస్‌ పూరన్‌తో కలిసి హోప్‌ లక్ష్యాన్ని ఛేదించాడు. హర్మిత్‌ సింగ్‌ ఒక వికెట్‌ తీశాడు.

గత మ్యాచుల్లో ప్రభావం చూపిన సౌరభ్‌ నేత్రవల్కర్.. తేలిపోవడం యూఎస్‌ఏకు ఎదురుదెబ్బ తగిలింది. రోస్టన్ ఛేజ్‌కు (3/19) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇక చివరి మ్యాచ్‌లో జూన్ 24న దక్షిణాఫ్రికాతో విండీస్‌ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సెమీస్‌కు చేరుకొనే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా ఈ రేసులో ఉంది. యూఎస్‌ఏతో జూన్‌ 23న తలపడనుంది. సూపర్‌-8 పోరులో రెండు మ్యాచ్‌లోనూ ఓడిన యూఎస్‌ఏ కథ ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement