Friday, November 22, 2024

First Test – డీన్‌ ఎల్గర్‌ సూపర్ సెంచరీ – భారత్ పై దక్షిణాఫ్రికా స్వల్ప ఆధీక్యం

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా రెండో రోజూ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత్‌ను 245 పరుగులకే పరిమితం చేసిన దక్షిణాఫ్రికా.. రెండో రోజు ఆ స్కోరును అధిగమించడంతో పాటు ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. తన కెరీర్‌లో చివరి టెస్టు సిరీస్‌ ఆడుతున్న సఫారీ మాజీ సారథి డీన్‌ ఎల్గర్‌ (211 బంతుల్లో 140 నాటౌట్‌, 23 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగాడు.

వెలుతురు లేమి కారణంగా ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి పదకొండు పరుగుల స్వల్ప ఆధిక్యంతో టీమిండియాపై సౌతాఫ్రికా పైచేయి సాధించింది. టీమిండియా పేసర్లలో బుమ్రాకు రెండు, సిరాజ్‌కు రెండు, ప్రసిద్‌ కృష్ణకు ఒక వికెట్‌ దక్కాయి..

అంతకుముందు భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. కెఎల్‌ రాహుల్‌ (101) సెంచరీతో రాణించాడు. రెండో రోజు ఏడు ఓవర్లు మాత్రమే బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. రాహుల్‌ ఔటవడంతో పెవలియన్‌ చేరింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సఫారీలు.. ఓపెనర్‌ మార్క్‌రమ్‌ (5) వికెట్ త్వరగా కోల్పోయినా తర్వాత పుంజుకున్నారు. టోని డీ జోర్జి (23)తో రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించిన ఎల్గర్‌.. అతడు నిష్క్రమించినా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నాడు.140 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న అతడు ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగించాడు. అతడికి డేవిడ్‌ బెడింగ్‌హమ్‌ నుంచి చక్కని సహకారం లభించింది.

టీ విరామం తర్వాత అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న బెడింగ్‌హమ్‌ను సిరాజ్‌ బౌల్డ్‌ చేయడంతో 131 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే ప్రసిధ్‌.. వికెట్‌ కీపర్‌ కైల్‌ వెరియన్నెను ఔట్‌ చేయడంతో సఫారీలు ఐదో వికెట్ కోల్పోయారు

Advertisement

తాజా వార్తలు

Advertisement