Friday, November 22, 2024

రెజ్లింగ్‌ సమాఖ్యపై ఫైర్.. జంతర్‌మంతర్‌ వద్ద రెజ్లర్ల ఆందోళన

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కి వ్యతిరేకంగా భారత రెజర్లు రోడ్డెక్కారు. ఢిల్లిలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు దిగారు. బజరంగ్‌ పునియా కోచ్‌ను తొలగించడంపై రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పునియాతోపాటు కోచ్‌ సుజీత్‌ మాన్‌, ఫిజియో ఆనంద్‌ దూబే సహా బజరంగ్‌ సహాయక సిబ్బంది, సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫొగట్‌, సరితా మోర్‌, సంగీతా ఫొగట్‌, సత్యవర్త్‌ మాలిక్‌, జితేందర్‌ కిన్హా, సుమిత్‌ మాలిక్‌ తదితర రెజ్లర్లు ఆందోళన చేస్తూ జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రజ్‌ భూషణ్‌ శరణ్‌ను బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

రెజ్లింగ్‌ క్రీడాకారుల పట్ల జాతీయ సమాఖ్య ఏకపక్ష వైఖరిని ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. దేశానికి పతకం సాధించినా గౌరవం దక్కడం లేదని విచారం వ్యక్తం చేశారు. ”దేశానికి పతకాలు సాధించేందుకు ఆటగాళ్లు అన్ని విధాలా ప్రయత్నిస్తారు. కానీ ఫెడరేషన్‌ మమ్మల్ని తక్కువగా చూడటం తప్ప చేసిందేమి లేదు. అథ్లెట్లను చిత్రహింసలకు గురిచేసేందుకు ఏకపక్ష నిబంధనలు రూపొందిస్తున్నారు” అని రెజ్లర్‌ సాక్షి ట్వీట్‌ చేసింది. అన్షు మాలిక్‌, సంగీతా ఫొగట్‌తో పాటు ఇతర రెజ్లర్లు కూడా ఇదే తరహాలో ”బాయ్‌కాట్‌ డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్‌” హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement