ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో జరుగుతున్నప్పటికీ హంగామా అంత హైదరాబాద్ నగరంలోనే కనిపిస్తుంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు రెడీ అవుతున్నాయి. పబ్స్, లాంజ్‌లు.. క్రికెట్ థీమ్ అలంకరణతో క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
మన హైదరాబాద్ టీమ్ ఫైనల్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నగరవాసులను ఉర్రూతలూగించనుంది. దీంతో ఎంట్రీ ఫీజు కనీసం రూ.500 నుంచి ప్రారంభించి ఆపై ధరలో విభిన్న రకాల ఆకర్షణలతో క్రికెట్ అభిమానుల్ని లైవ్ ఏర్పాట్లతో హోటల్స్, పబ్స్, లాంజ్ లు ఆహ్వానిస్తున్నాయి.
కాగా, గచ్చిబౌలిలోని ముస్టాంగ్ టెర్రస్ లాంజ్‌లో ఏకంగా 3 స్క్రీన్స్ ఏర్పాటు చేసేశారు. కార్ఖానాలోని ద బార్ నెక్ట్స్ డోర్‌లో 2 బిగ్ స్క్రీన్స్, జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్‌లో 2 స్క్రీన్స్, మాదాపూర్‌లోని రష్ స్పోర్ట్స్ బార్ అండ్ బౌలింగ్ సెంటర్‌లో పెద్ద స్క్రీన్ తో పాటు చిన్నపాటి టీవీలను కూడా ఏర్పాటు చేయడంతో పూర్తిగా ఐపీఎల్ సందడికి నెలకొంది. హైదరాబాద్ నగరంలోని పబ్స్, బార్స్, రెస్టారెంట్స్‌తో పాటు సికింద్రాబాద్ క్లబ్, జింఖానా క్లబ్, ఫిలింనగర్ క్లబ్.. లాంటి సంపన్నులకు చెందిన క్లబ్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో క్రికెట్ అభిమానులను ఆహ్వానిస్తున్నాయి. కాగా, ఇప్పటికే మాల్స్, మల్టిఫ్లెక్స్‌లూ, కెఫెలు సైతం స్పెషల్ స్క్రీన్స్ ఏర్పాటులో పోటీ పడుతున్నాయి.