FIM E-Xplorer బైక్ రేసింగ్ మోటార్‌స్పోర్ట్స్ 2024 సీజన్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. కాగా, ఈ ఎఫ్ఐఎమ్(FIM) వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మొట్టమొదటి సారి భారతీయ రేటింగ్ టీమ్ పాల్గొనబోతుంది. హైదరాబాద్‌కు చెందిన కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ (KSG) ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఓ జట్టును సొంతం చేసుకుంది. దాదాపు తొమ్మిదేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. ఐఎన్‌డీఈ(INDE)అనే పేరుతో వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనుంది. ఇక, తాజాగా ఐఎన్‌డీఈ జట్టును ప్రకటించింది.
ఇండి (INDE) రేసింగ్ నుంచి ఐశ్వర్య, సాండ్రా గోమెజ్ లు రైడ్ చేయనున్నారు. ఈ సందర్భంగా.. కంకణాల స్పోర్ట్స్ గ్రూప్, INDE రేసింగ్ వ్యవస్థాపకుడు అభిషేక్ రెడ్డి కంకణాల మాట్లాడుతూ.. భారతదేశంలో మోటార్‌స్పోర్ట్స్‌పై ఆసక్తి పెరుగుతోందన్నారు. INDE రేసింగ్ ప్రారంభంతో మేం రేస్‌ట్రాక్‌లో మాత్రమే కాకుండా సుస్థిరత్వం, లింగ సమానత్వం, వినూత్నత స్ఫూర్తిని ప్రోత్సహించడంలో కూడా భారతీయ మోటార్ స్పోర్ట్ లలో కొత్త పుంతలు తొక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. భారతదేశం మొట్టమొదటి గ్లోబల్ మోటార్‌స్పోర్ట్స్ టీమ్‌ను స్థాపించడం ద్వారా మేం కొత్త తరం భారతీయ రైడర్‌లను ప్రేరేపించాలనుకుంటున్నాం. రేసింగ్ ప్రపంచంలో దేశపు నైపుణ్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఇక FIM E-Xplorer 2024 సీజన్ ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు జరగనుండగా… ప్రతి రౌండ్‌లోనూ ఐఎన్‌డీఈ పాల్గొనుంది. జపాన్, నార్వే, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లలో సవాలుతో కూడిన ట్రాక్‌లపై పాల్గొన్న తరువాత తిరిగి భారతదేశానికి రావడంతో విజవంతమైన సీజన్ ముగియనుంది.