ఫిఫా వరల్డ్ కప్ 2022 టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వరల్డ్ కప్ మొదలు కావడానికి ఇంకా 100 రోజులు ఉండగానే అప్పుడే 24. 50 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని ఫిపా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ టికెట్లను కొనుగోలు చేశారని పేర్కొంది. ముఖ్యంగా ఖతార్, అమెరికా, యూకే, సౌదీ అరేబియా, మెక్సికో, యూఏఈ, ఫ్రాన్స్, అర్జెంటీనా, బ్రెజిల్, జర్మనీ దేశాలకు చెందిన అభిమానులే ఎక్కువగా టికెట్లు కొనుక్కున్నారని వెల్లడించింది.
జులై 5 నుంచి ఆగస్టు 16 వరకు 5లక్షల టికెట్లు..
టికెట్ల విక్రయాల చివరిదశలో అంటే జులై 5 నుంచి ఆగస్టు 16 వరకు ఐదు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని ఫిఫా ప్రకటించింది. ఐదు మ్యాచ్‌ల టికెట్లను దక్కించుకునేందుకు అభిమానులు ఎగబడ్డారని ఫిఫా పేర్కొంది. కామెరూన్ వర్సెస్ బ్రెజిల్, బ్రెజిల్ వర్సెస్ సెర్బియా, పోర్చుగల్ వర్సెస్ ఉరుగ్వే, కోస్టారికా వర్సెస్ జర్మనీ, ఆస్ట్రేలియా వర్సెస్ డెన్మార్క్ మ్యాచుల టికెట్లు విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే అయిపోయాయని తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ సేల్ దశ సెప్టెంబర్‌లో మొదలుకానుంది. ఈ సమయంలో మరిన్ని టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. మిడిల్ ఈస్ట్, అరబ్ దేశాల్లో జరుగుతున్న మొట్ట మొదటి ఫిఫా వరల్డ్ కప్ కావడంతో ఈ మ్యాచులను చూసేందుకు అభిమానులు ఆసక్తితో ఉన్నారు. ఇక ఫిఫా ప్రపవచకప్ నవంబర్ 20 నుండి ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య జరుగనుంది.