Friday, November 22, 2024

WPL : నిప్పులు చెరిగిన ఫెర్రీ… ముంబై కి ఆర్సీబి షాక్

డబ్ల్యూపీఎల్‌ సీజన్‌-2లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. గ‌త‌రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన ఆర్సీబీ స్టార్‌ ఎలీస్‌ పెర్రీ తమ జట్టును ఒంటిచేత్తో గెలిపించింది.

- Advertisement -

ముందు బౌలింగ్‌లో (6/15)తో విజృంభించిన పెర్రీ.. తర్వాత బ్యాటింగ్‌లోనూ (40 నాటౌట్‌; 38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌) రాణించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 15 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ విజయానందుకుంది. కెప్టెన్‌ స్మృతి మంధాన (11), సోఫీ మొలినియోక్స్‌ (9), సోఫీ డివైన్‌ (4) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకోగా.. అనంతరం పెర్రీ (40 నాటౌట్‌), రిచా ఘోష్‌ (36 నాటౌట్‌; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆర్సీబీని విజయలతీరానికి చేర్చారు.

కాగా, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లి జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌కు రాయల్‌ చాలెంజర్స్‌ బౌలర్లు హడలెత్తించారు. ముంబై ఓపెనర్లు హీలె మాథ్యూస్‌, సంజన శుభారంభాన్నిచ్చారు. ధాటిగా ఆడిన వీరు మొదటి వికెట్‌కు 43 పరుగులు జోడించారు. అనంతరం హీలె మాథ్యూస్‌ (26; 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) డివైన్‌ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగింది.
ఈ సమయంలో బంతి అందుకున్న ఆర్సీబీ బౌలర్‌ ఎలీస్‌ పెర్రీ నిప్పులు చెరిగే బంతులతో ముంబై బ్యాటర్లపై విరుచకపడింది. ఈమే ధాటికి దూకుడుగా ఆడుతున్న ఓపెనర్‌ సంజన (30; 21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌) క్లీన్‌ బౌల్డయ్యాయింది. తర్వాత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (0), ఎమెలీయ కెర్‌ (2), అమంజోత్‌ కౌర్‌ (4), పూజా వస్త్రాకర్‌ (6), స్కైవర్‌ బ్రంట్‌ (10)లను అందరిని పెర్రీ పెవిలియన్‌కి పంపించింది. బంతితో విధ్వంసం సృష్టించిన ఎలీస్‌ 15 పరుగులే ఇచ్చి కీలకమైన 6 వికెట్లు పడగొట్టింది. చివర్లో ప్రియాంకా (19) పర్వాలేదనిపించడంతో ఎమ్‌ఐ వంద పరుగుల మార్కును దాటింది. చివరికి 19 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement