సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్లంతా విఫలమైన వేళ.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన బ్యాటింగ్‌తో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. స్టార్ పేసర్ కగిసో రబడా బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి బాదిన సిక్సర్.. ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఈ సీజన్లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్న 20 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డిపై క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా అందరిలానే అనేక కష్టాలను ధాటుకుంటూ ఈ స్థాయికి చేరాడు.
ఉద్యోగం వదిలేసి..
ముఖ్యంగా అతని సక్సెస్ వెనుక నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి త్యాగం ఎంతో ఉంది. కొడుకు కెరీర్ కోసం ఆయన ఏకంగా ఉద్యోగమే మానేసాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించాడు. అతనిది సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం. అతని తండ్రి ముత్యాల రెడ్డి హిందూస్తాన్ జింక్‌లో ఉద్యోగం చేసేవాడు. నితీష్ రెడ్డి ఐదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. హిందూస్తాన్ జింక్ కంపెనీ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్‌తో తన ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అయితే ముత్యాల రెడ్డిని ఉదయ్‌పూర్ ట్రాన్స్ఫర్ చేయడంతో అతను కొడుకు కెరీర్ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
బంధువులు తిట్టినా..
ఈ నిర్ణయంతో బంధువులు అంతా తన తండ్రిని మందలించారని, కానీ ఆయన వాటిని పట్టించుకోలేదని ఓ ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు. కెరీర్ ఆరంభంలో విశాఖ మైదానంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు హాజరైన నితీష్ కుమార్ రెడ్డి.. మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సాయంతో కడపలోని ఏసీఏ అకాడమీలో చేరి మరింత రాటు దేలాడు.
ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఓపెనింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి మీడియం పేసర్‌గా సత్తా చాటాడు. ఇండియ అండర్ 19 బీ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2019-20 రంజీ సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో 366 పరుగులు చేశాడు.
రూ. 20 లక్షలకే..
గతేడాదే సన్‌రైజర్స్ అతన్ని రూ. 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయగా.. ఆ డబ్బులతో అతను కారు కొనుక్కున్నాడు. గత సీజన్ చివర్లో అతను బరిలోకి దిగినా.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన అతను.. సీఎస్కేతో తొలి అవకాశాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విన్నింగ్ షాట్‌తో మ్యాచ్ ముగించిన అతను.. తాజా మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు.
పవన్ పాట తనకు స్ఫూర్తి..
ఈ మ్యాచ్ లో నితీశ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ నితీశ్ రెడ్డి ఇలా రెచ్చిపోవడానికి కారణం పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ అట. మ్యాచ్‌కు ముందు ‘జానీ’ సినిమాలోని ‘నారాజుగాకురా మా అన్నయ్యా.. నజీరు అన్నయా.. ముద్దుల కన్నయ్య.. అరె మనరోజు మనకుంది మన్నయ్యా’ అనే పాటను వింటానని నితీశ్ తెలిపాడు. ఈ పాట బీట్, ఎనర్జీ తనకు బూస్ట్ ఇస్తుందని చెప్పాడు. అంతేకాదు నితీశ్ నారాజుగాకురా మా అన్నయ్యా పాట కూడా పాడాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.