అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 35 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో తమ స్థానంపై ప్రభావం చూపనప్పటికీ సీఎస్కే నెట్ రన్ రేటును తగ్గించుకుంది.
12 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు సీఎస్కేపై గెలిచిన గుజరాత్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 231 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 196 పరుగులు చేసి ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వివరించాడు. చెత్త ఫీల్డింగ్యే తమ కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు.
”ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేదు. 10-15 పరుగులు అదనంగా ఇచ్చాం. ప్రణాళిక అమలులో బాగానే ఉన్నాం. కానీ గిల్-సుదర్శన్ చాలా మంచి షాట్లు ఆడారు. బాగా ఆడుతున్న బ్యాటర్లను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. తిరిగి చెన్నైకి చేరుకోవాలి, ఎక్కువ సమయం లేదు. ఆదివారం మధ్యాహ్నం మరో మ్యాచ్ ఉంది. రాజస్థాన్ రాయల్స్‌తో టఫ్ ఫైట్ ఉంది” అని రుతురాజ్ పేర్కొన్నాడు. చెపాక్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్‌తో సీఎస్కే తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.