ఐపీఎల్‌లో గతేడాది ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన వల్ల భారత క్రికెట్ జట్టుకు నష్టమేనని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు. ఈ నిబంధన వల్ల శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి భారత ఆల్‌రౌండర్లు బౌలింగ్ చేయలేకపోతున్నారని, వాళ్ల సత్తాకు ఇది అడ్డుకట్ట వేస్తుందని హిట్‌మ్యాన్ అభిప్రాయపడ్డాడు.
‘క్రికెట్ అనేది 11 మందితో ఆడాలి కానీ 12మందితో కాదు. నాకు ఈ రూల్ నచ్చలేదు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఇలా చేస్తున్నారు. ఈ రూల్ వల్ల భారత జట్టులో వాషింగ్టన్, దూబే వంటి ఆటగాళ్లు బౌలింగ్ చేయడం లేదు. టీమిండియాకు ఇది మంచిది కాదు’ అని అన్నాడు. జూన్‌లో జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత జట్టు సెలక్షన్స్ కోసం రోహిత్.. హెడ్‌కోచ్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ కలిసి సమావేశమయ్యారని వస్తున్న వార్తలను ‘ఫేక్ న్యూస్’ అని కొట్టిపారేశాడు.