Friday, November 22, 2024

IPL: ఐపిఎల్ పండుగ‌కు అంతా సిద్ధం…

నేటి నుంచే ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభం
తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేతో ఆర్సీబీ ఢీ
స్టార్‌ ఆటగాళ్లతో హోరాహోరీ పోరు ఖాయం
రాత్రి 8గంటల నుంచి మొదలు
స్టార్‌ స్టోర్ట్స్‌ నెట్‌వర్క్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
జియో సినిమాలో ఫ్రీ స్ట్రీమింగ్‌

చెన్నై: క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసిన అతిపెద్ద క్రికెట్‌ పండుగగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 17వ సీజన్‌ నేటి సాయంత్రం ప్రారంభం కానుంది. టోర్నీ ఆరంభపు మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఢీకొననుంది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగే ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ రాత్రి 8గంటలకు మొదలు కానుంది. టోర్నీ ఆరంభోత్సవంలో బాలీవుడ్‌ స్టార్లు డాన్స్‌, ఆట పాటలతో సందడి చేయనున్నారు. అనంతరం మ్యాచ్‌ మొదలవుతోంది. మ్యాచ్‌ విషయానికి వస్తే స్టార్‌ ఆటగాళ్లతో ఇరుజట్లు సమానంగా ఉండటంతో ఈ మ్యాచ్‌ హోరాహోరీగా జరగడం ఖాయం. అందుకే ఈసారి ఇరుజట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. గతేడాది చిరస్మరణీయ ప్రదర్శనలతో అదరగొట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2023 టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈసారి కూడా మరో ట్రోఫీ దక్కించుకోవాలని చూస్తోంది.

ధోని నిర్దేశంలోనే …

టోర్నీ ఆరంభానికి ఒక్క రోజు ముందు మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్య బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్పుకోవడంతో సీఎస్‌కేకు భారీ షాక్‌ తగిలింది. దాంతో ఈ సీజన్‌లో యువ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ముందుండి సీఎస్‌కేను నడింపించనున్నాడు. ధోనీ కెప్టెన్‌గా తప్పుకున్నా బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌తో తన మార్కు ప్రదర్శన చూపెట్టడం ఖాయం. చెన్నై హోమ్‌ గ్రౌండ్స్‌లోనే ఈ మ్యాచ్‌ జరగనుండటం సీఎస్‌కేకు ప్లస్‌ పాయింట్‌ కానుంది. ధోనీతో పాటు కెప్టెన్‌ గైక్వాడ్‌, అజింక్యా రహానే, మోయిన్‌ అలీ, రచిన్‌ రవీంద్ర తదితరులతో బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లోనూ మిచెల్‌ సాంట్నర్‌, ముస్తాఫిజుర్‌, డారిల్‌ మిచెల్‌, మహీశ్‌ తీక్షణ వంటి అగ్రేశ్రేణి బౌలర్లు ఉన్నారు. ఇక ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహార్‌ వంటి టాప్‌ క్లాస్‌ ఆటగాళ్లు ఉండటం సీఎస్‌కేకు మరింత బలం. మొత్తంగా అన్ని విభాగాళ్లో సీఎస్‌కే బెంగళూరు జట్టును మట్టి కరిపించేందుకు రెడీగా ఉంది.

- Advertisement -

ఆర్సీబికి అగ్ని ప‌రీక్షే..
16 సీజన్‌లలో ఒక్క టైటిల్‌ కూడా సాధించని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఈసారి ఎలాగైనా తొలి ఐపీఎల్‌ ట్రోఫీ దక్కించుకోవాలనే కసితో బరిలోకి దిగుతోంది. ఇటీవల ముగిసిన మహిళల లీగ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ మహిళా జట్టు తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను గెలిచింది. కాగా, ఈసారి తాము కూడా ఐపీఎల్‌ ట్రోఫీని తప్పక సాధిస్తామని పురుషుల టీమ్‌ కూడా గట్టిగా నిర్ణయించుకుంది. అదే కసితో ఇప్పుడు బరిలోకి దిగనుంది. ప్రపంచ టాప్‌ క్లాస్‌ క్రికెటర్లలో ఒక్కడైన విరాట్‌ కోహ్లీ ఆర్సీబీకి చాలా కీలకం. ఇతను గత కొంత కాలంగా టీ20 మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కోహ్లీకి ఉంది. అతను చెలరేగితే సీఎస్‌కేకు కష్టాలు తప్పవు. అలాగే కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, హార్డ్‌ హిట్టర్‌ గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌, కామెరాన్‌ గ్రీన్‌, దినేశ్‌ కార్తిక్‌, మహ్మద్‌ సిరాజ్‌, టాప్లీ, కరణ్‌ శర్మ వంటి స్టార్‌ క్రికెటర్లతో ఆర్సీబీ టీమ్‌ పటిష్టంగా ఉంది.

సీఎస్కే దే పై చేయి…

ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్‌ టోర్నీలో ఆర్సీబీపై సీఎస్‌కేదే పైచేయి ఉంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇరుజట్లు 31 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఏకంగా 20 మ్యాచుల్లో గెలిచింది. మరోవైపు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మాత్రం కేవలం 10 మ్యాచుల్లో నెగ్గింది. ఒక్క మ్యాచ్‌ ఫలితం తేలలేదు. ఇక ఇరుజట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో సీఎస్‌కే నాలుగింటిలో విజయం సాధించగా.. ఆర్సీబీకి ఒక్కసారి గెలిచింది.

జట్ల వివరాలు (అంచనా)
చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), రచిన్‌ రవీంద్ర, అజింక్యా రహానే, మోయిన్‌ అలీ, డారిల్‌ మిచెల్‌, శివం దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్‌ ధోనీ (వికెట్‌ కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, మహీష్‌ తీక్షణ, ముకేశ్‌ చౌదరి/తుశార్‌ దేశ్‌పాండే.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, కామోరాన్‌ గ్రీన్‌, అనూజ్‌ రావత్‌/మహిపాల్‌ లోమ్రోర్‌, దినేశ్‌ కార్తిక్‌ (వికెట్‌ కీపర్‌), అల్జారీ జోసెఫ్‌, మహ్మద్‌ సిరాజ్‌, అకాశ్‌ దీప్‌/వైశాక్‌ విజయ్‌కుమార్‌, హిమాన్షు శర్మ/కరణ్‌ శర్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement