శ్రీలంక పర్యటన తర్వాత టీమిండియాకు లాంగ్ బ్రేక్ లభించింది. 42 రోజుల అనంతరం మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌తో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ పున:ప్రారంభం కానుంది. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. దాంతో అత్యుత్త టెస్ట్ టీమ్‌ను ఎంపిక చేసేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు మాస్టర్ ప్లాన్ రచించారు.
అందుకు ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ 2024ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ ఆటగాళ్లందరిని దులిప్ ట్రోఫీ ఆడాలని ఆదేశించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ తదితర ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.
నాలుగు జట్లతో..
సాధారణంగా దులిప్ ట్రోఫీలో ఈస్ట్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ ఆడుతాయి. కానీ ఈసారి సెలెక్టర్లు ఈ టోర్నీని నాలుగు జట్లతోనే ఆడించాలనుకున్నట్లు తెలుస్తోంది. భారత సీనియర్, భారత్-ఏ ఆటగాళ్లతో పాటు రంజీ క్రికెట్‌లో సత్తా చాటిన డొమెస్టిక్ క్రికెటర్లతో కలిపి ఏ, బీ, సీ, డీ జట్లతో ఈ టోర్నీని నిర్వహించాలని అజిత్ అగార్క్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.
ఈ టోర్నీ ద్వారా భారత ఆటగాళ్లకు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ అందించడంతో పాటు.. అత్యుత్తమ టాలెంట్‌ను బయటకు తీయాలని అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నారంట. ఈ టోర్నీలో పాల్గొనే నాలుగు జట్లకు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ కెప్టెన్లుగా వ్యవహరించే అవకాశం ఉంది.
నాలుగు జట్లు సమతూకంగా..
నాలుగు జట్లకు అవసరమయ్యే ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాటర్లు, వికెట్ కీపర్లు, ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లతో పాటు పేసర్లను ఎంపిక చేయడంపై భారత సెలెక్షన్ కమిటీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ ద్వారా దేశవాళీ ఆటగాళ్లకు కూడా సీనియర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం లభించనుంది.
బీసీసీఐ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి 24 వరకు జరగాల్సి ఉంది. అయితే టోర్నీని నాలుగు జట్లకు కుదిస్తే.. షెడ్యూల్‌లో కూడా స్వల్ప మార్పులు జరగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దులిప్ ట్రోఫీని ఇంకాస్త ముందుగానే ముగించే అవకాశం ఉంది. అయితే ఈ టోర్నీ నిర్వహణ గురించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దులీప్ ట్రోఫీ 2024 కోసం ఎంపిక చేసే నాలుగు జట్లు(అంచనా):
భారత్-ఏ: రోహిత్ శర్మ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, తిలక్ వర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములాని, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ
భారత్-బీ: జస్‌ప్రీత్ బుమ్రా(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్(కీపర్), సాయి కిషోర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్, ఉమ్రాన్ మాలిక్
భారత్-సీ: శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యూ ఈశ్వర్, విరాట్ కోహ్లీ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్
భారత్-డీ: రిషభ్ పంత్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, సౌరబ్ కుమార్, మహమ్మద్ షమీ, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్