స్పెయిన్ నాలుగోసారి యూరో కప్ విజేతగా అవతరించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 2-1 తేడాతో మట్టికరిపించింది. ఈ టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా ఫైనల్‌కు చేరిన స్పెయిన్ తుదిపోరులోనూ అదరగొట్టింది. గతసారి రన్నరప్ అయిన ఇంగ్లాండ్ ఈ సారి సైతం అదే హోదాతో సరిపుచ్చుకుంది.
తొలి అర్ధభాగం వరకు ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా పోరాడినప్పటికీ ఏ జట్టు గోల్ చేయలేకపోయింది. అయితే రెండో అర్ధభాగం ప్రారంభమైన రెండు నిమిషాలకే 47 నిమిషాల వద్ద స్పెయిన్ ఆటగాడు నికో విలియమ్స్ అద్భుత గోల్‌తో ఆ జట్టు ఖాతా తెరిచాడు.
73 నిమిషాల వద్ద ఇంగ్లాండ్ ఆటగాడు కోలె పాల్‌మెర్ గోల్ కొట్టడంతో ఇరు జట్లు 1-1తో సమమయ్యాయి. ఇక 86వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు మైకెల్ ఒయార్జాబల్ గోల్ కొట్టడంతో స్పెయిన్ మరోసారి ఆధిక్యంలోకి వెళ్లింది. అదనపు సమయంలో ఇంగ్లాండ్ గోల్ చేయలేకపోవడంతో స్పెయిన్ విజేతగా నిలిచింది.