Friday, November 22, 2024

Euro Cup .. నెదర్లాండ్స్ ‘సూపర్‌ గోల్‌’.. పొలెండ్ పై సంచలన విజయం

యూరో కప్‌-2024లో నెదర్లాండ్స్‌ బోణీ కొట్టింది. ఈ మెగా టోర్నిలో భాగంగా హాంబర్గ్ వేదికగా పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1తో నెదర్లాండ్స్‌ సంచలన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ గేమ్‌లో ఆఖరికి విజయం డచ్‌ జట్టునే వరించింది. తొలుత ఫస్ట్‌హాఫ్‌ 16వ నిమిషంలో ఆడమ్‌ బుకస పోలండ్‌కు మొదటి గోల్‌ను అందించాడు. అనంతరం 29వ నిమిషంలో నెదర్లాండ్స్‌ ఫార్వర్డ్‌ కోడి గక్పో అద్బుతమైన గోల్‌ కొట్టి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు.

ఫస్ట్‌హాఫ్‌ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో బ్రేక్‌ సమయంలో పొలాండ్‌ మేనెజర్‌ మిచాల్ ప్రోబియర్జ్ తమ జట్టులో ఒక మార్పు చేశాడు. జాకుబ్ మోడర్‌కు బదలుగా ఇంపాక్ట్‌ సబ్‌గా స్జిమాన్‌స్కీ జాకుబ్ తీసుకువచ్చాడు. కానీ ఎటువంటి ఫలితం లేదు. దీంతో ప్రోబియర్జ్ మళ్లీ 10 నిమిషాల తర్వాత మరో రెండు మార్పులు చేశాడు. కానీ ఫలితం ఏ మాత్రం మారలేదు. ఇక సెకెండ్‌ హాఫ్‌ ముగిసే సమయం దగ్గరపడుతుండడంతో 1-1 డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు.

వౌట్ వెఘొర్స్‌ అద్బుతం..
ఈ క్రమంలో డచ్ మేనేజర్ రోనాల్డ్ కోమాన్ తీసుకున్న ఓ నిర్ణయం అందరి అంచనాలను తారుమారు చేసింది. ఆఖరి బ్రేక్‌ సమయంలో మెంఫిస్ డిపే స్థానంలో వౌట్ వెఘోర్స్ట్‌ని ఇంపాక్ట్‌ సబ్‌స్ట్యూట్‌గా తీసుకువచ్చాడు. మైదానంలో అడుగపెట్టిన వెఘొర్స్ ఆట మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా 83వ నిమిషంలో గోల్‌కొట్టి డచ్‌ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో నెదర్లాండ్స్‌ జట్టు ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలిపోగా.. పొలాండ్‌ నిరాశలో కూరుకు పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement