ఇంగ్లండ్, టీమిండియా జట్ల మధ్య ఇవ్వాల (ఆదివారం) కీలకమైన మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ ఆటలో ఇంగ్లండ్ ఆరంభంలోనే బెయిర్‌స్టో (0), రూట్ (0) వికెట్లు కోల్పోయింది. అయితే.. ఆ తర్వాత వచ్చి జట్టును ఆదుకున్న బెన్‌స్టోక్స్ (27) కూడా పెవిలియన్ చేరాడు. జేసన్ రాయ్ (41)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన స్టోక్స్.. రాయ్ వెనుతిరిగిన తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ 23 ఓవర్లలో 125 పరుగులు చేసి కీలకమైన నాలుగు వికెట్లు పోగొట్టుకుంది.
ఇక.. ప్రసిద్ధ్ కృష్ణ, హార్దిక్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్లు కూడా ఆడలేకపోయారు. ఈ క్రమంలోనే పాండ్యా వేసిన 14వ ఓవర్ రెండో బంతికి ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో పాండ్యా షార్ట్ బాల్ వేయడంతో తడబడ్డాడు. దాన్ని ఎలాగోలా ఫ్లిక్ చేసేందుకు ప్రయత్నించగా.. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. పాండ్యా వేగంగా ముందుకొచ్చి క్యాచ్ అందుకోవడంతో స్టోక్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 125 పరుగులతో ఆట కొనసాగిస్తోంది. ఈ సమయానికి క్రీజులో జాస్ బట్లన్ 30, మోయిన్ అలీ 21 పరుగులతో స్కోర్‌బోర్డుని రొటేట్ చేస్తున్నారు.