ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. శనివారం నాలుగో రోజు ఆట ముగిసేసరికి కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో రెండు వికెట్లకు 62 పరుగులు సాధించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో టామ్ లాథమ్ (30), నీల్ వాగ్నర్ (1) ఉన్నారు. ఇంగ్లీష్ బౌలర్ ఓలీ రాబిన్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇంకా ఆటకు ఒక్కరోజే మిగిలిఉన్న నేపథ్యంలో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక వరణుడు కరుణిస్తేనే చివరి రోజు ఆట సజావుగా సాగనుంది.
ఓవర్ నైట్ స్కోరు 111/2తో నాలుగో రోజు, శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్‌ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దెబ్బ తీశాడు. నిప్పులుచెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ను వరుసగా పెవిలియన్ చేర్చాడు. సౌథీతో పాటు మరో పేసర్ కైల్ జేమిసన్ (3/85) కూడా విజృంభించడంతో ఇంగ్లాండ్ ఒక దశలో 140/6తో ఇబ్బందుల్లో పడింది. కెప్టెన్ జో రూట్ (42) ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు వద్దే ఔట్ కాగా.. ఓలి పోప్ (22), డేనియల్ లారెన్స్ (0), జేమ్స్ బ్రాసీ (0), మార్క్ వుడ్ (0) ఎక్కువసేపు నిలవలేకపోయారు.
ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఓపెనర్ రోరీ బర్న్స్ (132; 297 బంతుల్లో 16×4, 1×6) పట్టుదలగా పోరాడాడు. సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఒలీ రాబిన్సన్ (42) తోడుగా అతడు ఏడో వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. ఆపై స్టువర్ట్ బ్రాడ్ (10), జేమ్స్ ఆండర్సన్ (8) అండతో మరిన్ని పరుగులు చేశాడు. చివరకు 10వ వికెట్‌గా బర్న్స్ వెనుదిరిగాడు. ఆట చివరికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 62 పరుగులు చేసింది. ఇక డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయిన సంగతి తెలిసిందే.