Sunday, September 8, 2024

Women’s T20 | ఇంగ్లండ్‌-ఎదే సిరీస్‌.. చివరి మ్యాచ్‌లో భారత్‌-ఎ ఓటమి

మహిళల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్‌ మహిళలు కైవసం చేసుకున్నారు. భారత్‌-ఎతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-ఎ 2 వికెట్లతో విజయం సాధించింది. దాంతోపాటు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌ను గెలుచుకున్న భారత అమ్మాయిలు తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయారు. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 19.2 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది.

భారత జట్టులో దిశ కసత్‌ (20; 25 బంతుల్లో 1 సిక్స్‌), ఉమా చెత్రీ (21; 16 బంతుల్లో 3 ఫోర్లు) మినహా మిగతా బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. 7గురు సింగిల్‌ డిజిట్‌ స్కోరును కూడా దాటలేక పోయారు. ఇంగ్లండ్‌-ఎ బౌలర్లలో ఇస్సీ వాంగ్‌ (2/18), క్రిస్టీ గొర్డన్‌ (2/17), మాడి విల్లెర్స్‌ (2/19), లౌరెన్‌ ఫిలెర్‌ (2/15) సత్తా చాటారు. అనంతరం లక్ష్యచేదనకు దిగిన ఇంగ్లండ్‌ తడబడుతూ చివరి ఓవర్‌ తొలి బంతికి విజయం సాధించింది.

మొదట్లో కెప్టెన్‌ హొల్లి అర్మిటగే (27; 28 బంతుల్లో 3 ఫోర్లు), సెరెన్‌ స్మాలె (18) రాణించగా చివర్లో ఇస్సీ వాంగ్‌ (28 నాటౌట్‌; 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), క్రిస్టీ గొర్డన్‌ (10 నాటౌట్‌; 9 బంతుల్లో 2 ఫోర్లు) అద్భుతంగా బ్యాటింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌-ఎ 19.1 ఓవర్లలో (104/8) స్కోరుతో విజయాన్ని అందుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన ఇస్సీ వాంగ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement