ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు అద్భుతంగా రాణించారు. టు టైమ్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్, యువ బాక్సర్ మీనాక్షి గోల్డ్ మెడల్స్ సాధించారు. మొత్తంగా భారత బాక్సర్లు 12 పతకాలు చేజిక్కించుకున్నారు. శనివారంనాడిక్కడ జరిగిన ఫైనల్స్‌లో టు టైమ్ వరల్డ్ చాంపియన్, భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
52 కేజీల విభాగంలో తన ప్రత్యర్థి ఝజిరా ఉరాక్బయేవా (కజకిస్తాన్)పై 5-0తో విజయం సాధించింది. అలాగే 48 కేజీల విభాగంలో భారత యువ బాక్సర్ మీనాక్షి, తన ప్రత్యర్థి ఉజ్బెకిస్తాన్ బాక్సర్ రహ్‌మోనావో సాదహాన్‌పై 4-1 తేడాతో విజయం సాధించి బంగారం పతకం గెలుచుకుంది.
అటు అనామిక (50కేజీలు), మనీషా (60కేజీలు) తమ ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలై సిల్వర్ మెడల్స్‌తో సరిపెట్టుకున్నారు. అనామిక తన ప్రత్యర్థి చైనా బాక్సర్ వు యు చేతిలో 1-4 తేడాతో ఓటమిని చవిచూడగా, మనీషా కజకిస్తాన్ బాక్సర్ విక్టోరియా గ్రాఫీవ చేతిలో 0-5 తేడాతో పరాజయం పాలైంది.
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు మొత్తంగా 12 మెడల్స్ సాధించారు. మీనాక్షి (48కేజీలు), నిఖత్ జరీనా (52కేజీలు) గోల్డ్ మెడల్స్ సాధించగా, అనామికా (50 కేజీలు), మనీషా (60 కేజీలు) సిల్వ మెడల్స్ కైవసం చేసుకున్నారు. పురుషుల విభాగంలో చిసాబా ఇంగఖ సొయిబమ్ (48 కేజీలు), అభిషేక్ యాదవ్ (47 కేజీలు), విశాల్ (86కేజీలు), గౌరవ్ చౌహాన్ (92 ప్లస్ కేజీలు) కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. మహిళల విభాగంలో సోను (63 కేజీలు), మంజు బాంబొరియా (66కేజీలు), షలఖా సింగ్ సన్సాన్‌వల్ (70కేజీలు), మోనికా (81 ప్లస్ కేజీలు) కాంస్య పతకాలు చేజిక్కించుకున్నారు.