ఐపీఎల్ క్రికెట్ సందడి మొదలయ్యింది. స్టూడెంట్స్‌కి సెలవులు రావడంతో మ్యాచులను చూస్తూ టీవీలకు అతుక్కుపోతున్నారు. సిటీ నుంచి పల్లెల దాకా ఐపీఎల్ సందడి నెలకొంది. నిన్న జరిగిన చెన్నై, గుజరాత్ తొలి మ్యాచ్‌తో ఉత్కంఠ కూడా నెలకొంది. ఇక హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు టాటా ఐపిఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనికోసం రాచకొండ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా తెలంగాణ పోలీసుల వివిధ విభాగాల నుంచి సుమారు 1500 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇవ్వాల (శనివారం) తెలిపారు. 340 నిఘా కెమెరాలు, విధ్వంస నిరోధక తనిఖీలతో భద్రతను పెంచనున్నట్టు చెప్పారు.
అవసరమైనప్పుడు తక్షణ చర్య తీసుకోవడానికి అన్ని CCTV ఫుటేజీలను పర్యవేక్షించడానికి గాను జాయింట్ కమాండ్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతి మ్యాచ్ పూర్తయ్యే వరకు విధ్వంస నిరోధక తనిఖీలు నిరంతరాయంగా నిర్వహిస్తామని చౌహాన్ చెప్పారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా, మహిళలపై వేధింపుల వంటివి జరగకుండా తనిఖీ చేసేందుకు షీ టీమ్స్ ను నియమించారు. ఏదైనా ఆకస్మిక పరిస్థితి తలెత్తితే అట్లాంటి పరిస్థితులను ఈజీగా ఎదుర్కొనేందుకు, అంబులెన్స్ లు, ఫైర్ టెండర్‌లను స్టేడియంలో ఉంచనున్నట్టు తెలిపారు. స్టేడియం, దాని చుట్టుపక్కల వ్యూహాత్మక ప్రదేశాల్లో సాయుధ పోలీసులను మోహరిస్తామని సీపీ చెప్పారు.
ఇక.. డే టైమ్‌లో జరిగే మ్యాచ్‌లకు స్టేడియం గేట్లను మ్యాచ్ జరగడానికి మూడు గంటల ముందు మాత్రమే ఓపెన్ చేయనున్నారు. నైట్ జరిగే మ్యాచ్‌లకు సాయంత్రం 4.30 గంటలకు గేట్లు ఓపెన్ చేస్తారు. మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోకి కొన్ని వస్తువులను తీసుకెళ్లడంపై కూడా పోలీసులు ఆంక్షలు ప్రకటించారు.
* ల్యాప్‌టాప్‌లు
* వాటర్ బాటిల్స్
* కెమెరాలు
* సిగరెట్లు
* ఎలక్ట్రానిక్ వస్తువులు
* మ్యాచ్ బాక్స్ / లైటర్లు
* పదునైన మెటల్ / ప్లాస్టిక్ వస్తువులు
* బైనాక్యులర్స్
* రాసే పెన్నులు
* బ్యాటరీలు
* హెల్మెట్లు
* పరిమళ ద్రవ్యాలు
* సంచులు
* బయట తినుబండారాలు.