ఇబ్రహీంపట్నం, నవంబర్ 4 (ఆంధ్రప్రభ): ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూలపాడు క్రికెట్ స్టేడియంలో సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. క్రికెట్ అకాడమీ ఏర్పాటునకు సంబంధించి డిజైన్లు తయారు చేసి ఏడాదిలోపు ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని డా.గోకరాజు లైలా గంగరాజు ఏసీఏ క్రికెట్ స్టేడియాన్ని సోమవారం ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు. వీరికి ఏసీఏ అడ్మిన్ మేనేజర్ జి.శ్రీనివాసరావు, కేడీసీఏ సెక్రటరీ ఎం.రవీంద్ర చౌదరి, కేడీసీఏ జాయింట్ సెక్రటరీ రజనీకాంత్ లతో పాటు సాదర స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు.
అనంతరం మూలపాడు క్రికెట్ స్టేడియంలోని రెండు మైదానాలు పరిశీలించారు. అలాగే క్రికెట్ క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూమ్స్ ను పరిశీలించారు. అలాగే స్టేడియంలోని మౌలిక వసతుల కల్పన, సుందరీకరణపై అధికారులు, స్టేడియం నిర్వాహకులు, సిబ్బందితో చర్చించారు.
అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ… మంగళగిరి, మూలపాడు స్టేడియాలను ఏడాదిలోపు అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మూలపాడు క్రికెట్ మైదానంలో రెండో గ్రౌండ్ లో పిచ్ మరో నెలరోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే మూలపాడు క్రికెట్ స్టేడియంకు రావడానికి ఉన్న మూడుదారులను అభివృద్ధి చేసేందుకు నాయకులు, అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. మూలపాడు క్రికెట్ స్టేడియంకు త్వరలో మంచి రోజులు రానున్నాయని, క్రికెట్ స్టేడియంతో పాటు గోల్ఫ్ కోర్స్ కూడా రాబోతుందన్నారు.
పరిస్థితులు అనుకూలించి గోల్ప్ కోర్స్ వస్తే ఇబ్రహీంపట్నం మండలంలో దాదాపు 400మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఇక ఏసీఏ గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ క్రీడాకారులను వెలికి తీయటానికి పనిచేస్తుందన్నారు. ఐపీఎల్, ఏపీఎల్ రావటం వల్ల క్రికెట్ లో క్రీడాకారులకు చాలా అవకాశాలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో క్రికెట్ గ్రౌండ్స్ లేని రూరల్ ప్రాంతాల్లో ఏసీఏ తరుఫున గ్రౌండ్స్ ఏర్పాటు చేయటానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఐపీఎల్ తో పాటు, ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి ఏసీఏ తరుఫున ఎక్కువ మంది క్రికెటర్లు ఉండే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రాబోయే నాలుగేళ్లలో 175 నియోజకవర్గాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్, క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గత ఐదేళ్లలో ఏసీఏ అధ్యక్షుడిగా ఉన్న వారు ఏరోజు రాష్ట్రంలో ఉన్న క్రికెట్ గ్రౌండ్ లను పరిశీలించేందుకు వెళ్లలేదని.. తాము స్వయంగా గ్రౌండ్స్ పరిశీలించి వాటి అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజా, తెలుగు యువత జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి గరికపాటి శివ, టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.