దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ శతకంతో చెలరేగాడు. అనంతపురం వేదికగా ఇండియా సీ, ఇండియా-బీ మద్య జరుగుత్న మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 126 బంతుల్లో 111 (14 ఫోర్లు, 3 సిక్సర్లతో) సెంచరీ అందుకున్నాడు.
గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌కు దూరమైన ఇషాన్ కిషన్ రెండో రౌండ్‌లో ఇండియా-సీ తరఫున బరిలోకి దిగాడు. కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-సీకి ఆదిలోనే చుక్కెదురైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పటిదార్ (40; 67 బంతుల్లో, 8 ఫోర్లు) మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (43; 75 బంతుల్లో, 8 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
అయితే వీరిద్దరు అర్ధశతకాల చేరువవుతున్న క్రమంలో ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో వికెట్ తీసి దెబ్బకొట్టారు. దీంతో ఒక్క పరుగు వ్యవధిలోనే పటిదార్, సుదర్శన్ వెనుదిరిగారు. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. ఇంద్రజిత్ (62 నాటౌట్; 123 బంతుల్లో, 6 ఫోర్లు) స్కోరుబోర్డుపై పరుగుల వరదపారించారు. కాగా, రెండో రౌండ్ తొలి రోజు ఆట ముగిసేసరికి ఇండియా-సీ 79 ఓవర్లకు 357/5 స్కోరు చేసింది.