దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీని సౌత్‌జోన్ మరోసారి కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన వెస్ట్‌జోన్‌పై 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో వెస్ట్ జోన్‌కు పరాజయం తప్పలేదు. సౌత్‌జోన్ కెప్టెన్ హనుమ విహారి జట్టును ముందుండి నడిపించాడు. సౌత్‌జోన్ నిర్దేశించిన 298 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్ట్‌జోన్ 222 పరుగులకే ఆలౌటైంది. వెస్ట్‌జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (95), సర్ఫరాజ్ ఖాన్ (48) పోరాడినా.. ఓటమి తప్పలేదు.
వాసుకి కౌషిక్ (4/36), సాయి కిశోర్ (4/57), విద్వత్ కావేరప్ప (1/51), వైశాక్ (1/39) దెబ్బకు వెస్ట్ జోన్ కుదేలైంది. సౌత్‌జోన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే వెస్ట్ జోన్ ఆలౌట్ చేసింది. అయితే, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలం కావడంతో వెస్ట్‌జోన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్ట్ జోన్‌ను దెబ్బకొట్టాడు. పృథ్వీషా, పుజారా, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్‌ఖాన్ వంటి టాప్ బ్యాటర్లు ఉన్నప్పటికీ కావేరప్ప ధాటికి నిలవలేక పోయారు. సూర్యకుమార్ యాదవ్ (8, 4), పుజారా (4, 15) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిరాశపరిచారు. దీంతో 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన సౌత్ జోన్ 230 పరుగులకు ఆలౌటైంది. దీంతో వెస్ట్‌జోన్ ఎదుట 298 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం వెస్ట్‌జోన్ 222 పరుగులకే పరిమితమైంది. సౌత్ జోన్ బౌలర్ కావేరప్పకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి.
సంక్షిప్త స్కోర్లు:
సౌత్ జోన్: తొలి ఇన్నింగ్స్ 213, రెండో ఇన్నింగ్స్ 230.
వెస్ట్ జోన్: తొలి ఇన్నింగ్స్ 146. రెండో ఇన్నింగ్స్ 222