- జ్వెరెవ్, అల్కరాజ్, కోకో గాఫ్ ముందంజ
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్-2025 టెన్నిస్ టోర్నీలో మాజీ ఛాంపియన్, 24 గ్లాండ్‌స్లామ్స్ విజేత నొవాక్ జకోవిచ్, వరల్డ్ నెం.1 అరీనా సబలెంకా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మరోవైపు స్టార్ ప్లేయర్లు కార్లోస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌లతో పాటు అమెరికా యువ సంచలనం మూడో సీడ్ కోకో గాఫ్, తదితరులు కూడా నాకౌట్‌కు అర్హత సాధించారు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ 6-3, 6-4, 7-6 (7-4) తేడాతో 24వ సీడ్ జిరి లెహెక్కా (చెక్ రిపబ్లిక్)ను వరుస సెట్లలో చిత్తు చేసి 15వ సారి ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. దీంతో పాటు మరో దిగ్గజం రోజర్ ఫెదరర్ (15 సార్లు) రికార్డును సమం చేశాడు.
ఇక్కడ జరిగిన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 7-5, 6-1 తేడాతో 15వ సీడ్ జాక్ డ్రాపెర్‌పై విజయం సాధించాడు. అల్కరాజ్ రెండు సెట్లు గెలిచిన తర్వాత డ్రాపెర్ గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. దీంతో మ్యాచ్ రిఫరీలు కార్లోస్‌ను విజేతగా ప్రకటించారు.
క్వార్టర్స్ లో జకోవిచ్‌తో అల్కరాజ్ ఢీ
క్వార్టర్స్ పోరులో సెర్బియా దిగ్గజం జకోవిచ్‌తో స్పెయిన్ యువ స్టార్ అల్కరాజ్ ఢీ కొననున్నాడు. కాగా, గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో జకోవిచ్.. అల్కరాజ్‌ను ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక్కడ జరిగిన మరో మ్యాచ్‌లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-1, 2-6, 6-3, 6-2తో 14వ సీడ్ ఉగో హంబెర్ట్‌పై విజయం సాధించి టోర్నీలో ముందంజ వేశాడు. ఇతడు క్వార్టర్స్‌లో 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
సబలెంకా అలవోకగా..
మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ప్రపంచ నెం.1.. బెలారస్ భామ అరీనా సబలెంకా 6-1, 6-2 తేడాతో14వ సీడ్ మీరా అండ్రీడా (రష్యా)ను వరుస సెట్లలో చిత్తు చేసి అలవోకగా క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది.
ఇంకో మ్యాచ్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 5-7, 6-2, 6-1 తేడాతో బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించింది. మహిళల సింగిల్స్ ఇతర మ్యాచుల్లో 11వ సీడ్ పౌలా బడొసా, 27వ సీడ్ పవ్లియుచెన్‌కోవాలు కూడా అద్భుత విజయాలతో నాకౌట్‌కు దూసుకెళ్లారు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో భారత స్టార్ రోహన్ బోపన్న-జాంగ్ షుయ్ (చైనా) జోడీ మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది.