కోదాడ, (ప్రభ న్యూస్): రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి జిల్లా స్థాయిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జాతీయ బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. ఆదివారం కోదాడలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గోపీచంద్ బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి క్రీడాకారుడు తోట రంగారావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ప్రతిభకు కొదవలేదన్నారు. క్రీడా రంగం అభివృద్ధికి గతంలో కన్నా ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. గత మూడు ఒలింపిక్స్‌ల్లో భారతదేశానికి పతకాలు రావడం శుభపరిణామమన్నారు. ఒలింపిక్స్ విజేత పీవీ సింధుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని రానున్న మరో పది సంవత్సరాలు దేశానికి ఆమె క్రీడా రంగంలో సేవలు అందించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలో పెద్ద స్థాయిలో టోర్నీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు- జరుగుతున్నాయన్నారు. ఈ టోర్నమెంట్‌ల ద్వారా క్రీడాకారుల ర్యాంకింగ్ మెరుగవుతుందని, తద్వారా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు గా ఎదిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియా తదితర పధకాల ద్వారా క్రీడా రంగాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. చిన్నతనం నుండే ప్రతి ఒక్కరికి ఆటల పై మక్కువ పెరిగేందుకు క్రీడా మైదానాలు ఏర్పాటు- అవసరమన్నారు. కోదాడలో ఉన్న ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం ఉన్నతమైన ప్రమాణాలతో ఉందని, ఇక్కడ ప్రాంత క్రీడాకారులు, స్థానికులు క్రీడాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital