2023 ప్రపంచకప్ టోర్నీ చివరి దశకు చేరింది. సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. బుధవారం వాంఖడే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ చాన్స్ కోసం తలపడబోతున్నాయి. నాలుగేళ్ల కిందట ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని రోహిత్‌సేన పట్టుదలతో ఉంది. లీగ్‌దశలో అన్ని మ్యాచ్‌లు నెగ్గిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో పోటీకి సై అంటోంది. పైగా వాంఖడే టీమిండియాకు లక్కీ గ్రౌండ్ అనే పేరుంది. 2011లో ఇక్కడే శ్రీలంకను ఓడించడం ద్వారా ధోనీ సేన ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. లీగ్ దశలో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్ ఒత్తిడిలోనే బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో కిందటి సారి జరిగిన సెమీఫైనల్‌ను ఓసారి గుర్తుచేసుకుందాం..
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. వర్షం అంతరాయం వల్ల రిజర్వుడే కి పొడిగించబడిన ఈ మ్యాచ్‌లో అదృష్టం కివీస్‌ను వరించింది. వారి పేస్‌దళం టీమిండియా టాపార్డర్ కొమ్ములు వంచడంలో సఫలమైంది. 240 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన ధోనీ సేన కివీస్ బౌన్సర్లకు బెంబేలెత్తింది. రోహిత్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇలా వచ్చి అలా ఔటై వెళ్లారు. జట్టు స్కోరు 5 పరుగులకే ఈ ముగ్గురు పెవిలియన్ చేరారు. కొద్దిసేపటికే దినేశ్ కార్తీక్ కూడా వెనుదిరిగాడు. దాంతో ధోనీ సేన గెలుపుపై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. 10 ఓవర్లలో భారత్ స్కోరు 24/4… ఈ దశలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కొద్దిసేపు పోరాడారు. కివీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచారు. కానీ ధాటిగా పరుగులు చేయలేకపోయారు. 30.3 ఓవర్ల సమయంలో వీరూ ఔటయ్యారు. అప్పటికి జట్టు స్కోరు 92/6. ఇక మిగిలింది జడేజా.. ధోనీ ఇద్దరే. ఏదో అద్భుతం జరుగుతుందేమోనని అభిమానుల్లో చిన్న ఆశ. ఈ ఆశను నిజం చేసేలా ఈ జంట ఆచి తూచి ఆడింది. శక్తినంతా కూడదీసుకుని ఒక్కో పరుగూ జోడిస్తూ గెలుపుపై ఆశలు రేకెత్తించారు. వీరిద్దరు 104 బంతుల్లో 116 పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టులో అలజడి మొదలైంది.
టీమిండియా అభిమానుల ముఖాల్లో ఓవైపు కొంచెం సంతోషం.. మరోవైపు ఉత్కంఠ… భయం.. చివరిదాకా వీళ్లిద్దరూ నిలబడితే చాలనే ఆక్షాంక్ష. 58 బంతులు ఎదుర్కొని 77 పరుగులు చేసిన జడేజా ఔట్.. ఒక్కసారిగా అభిమానుల్లో నైరాశ్యం.. అప్పటికి జట్టు స్కోరు 208. మ్యాచ్ గెలవాలంటే ఇంకా 32 పరుగులు చేయాలి. మిగిలింది 13బంతులే. ఐనా ధోనీ ఉన్నాడుగా అనే భరోసా. హెలికాప్టర్ షాట్లతో అద్భుతం చేస్తాడన్న గట్టి నమ్మకం. మహేంద్ర సింగ్ బ్యాట్ ఝులిపించసాగాడు. భారత జట్టు మెల్లగా గెలుపు వైపు అడుగులు వేస్తోంది.. ఇరుజట్లు ఒత్తిడిలో ఉన్నాయి. అభిమానులు రెప్పవేయకుండా ప్రతి బంతిని.. ప్రతి కదలికను ఉత్కంఠగా చూస్తున్నారు. పరుగులు వస్తే సంతోషం.. బౌండరీకి కేరింతలు.. ఇలా సాగుతోంది.. విజయానికి దగ్గరవుతున్న వేళ మార్టిన్ గప్తిల్ మెరుపు ఫీల్డింగ్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. స్కేర్‌లెగ్‌వైపు బంతిని నెట్టిన ధోనీ రెండవ పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ బంతిని అందుకున్న గప్తిల్ అంతదూరం నుంచి నేరుగా వికెట్లను గిరాటేశాడు. మహీ క్రీజ్‌ను చేరినట్లు కనిపించింది. కానీ టీవీ రిప్లైలో మహీ బ్యాట్ క్రీజ్‌కు ఆరేడు సెంటీమీటర్ల దూరంలో ఉన్నట్లు తేలింది. దాంతో ధోనీ రనౌట్‌తో పాటు టోర్నీ నుంచి భారత జట్టు కూడా ఔటైంది. 72 బంతులు ఆడిన ధోనీ 50 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 49.3 ఓవర్లకు 221 పరుగులు చేసిన టీమిండియా చివరకు 18 పరుగుల తేడాతో ఓడింది.