మహేంద్ర సింగ్ ధోనితో ఎవరూ సరిపోలరని అతడొక్కడేనని యువ వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్ అన్నాడు. తనను ఎంఎస్‌డీతో పోలుస్తున్న నేపథ్యంలో ఇలా స్పందించాడు. ”ధోని సార్‌తో నన్ను పోల్చినందుకు దిగ్గజ సునీల్ గావస్కర్‌కు కృతజ్ఞతలు. కానీ ఒక్కడే ధోని ఉంటాడు. అతడితో ఎవరూ సరితూగరు. మహి సాధించిన ఘనతలను అందుకోవడం చాలా కష్టం. నేను ధ్రువ్ జురెల్‌లాగే ఉండాలనుకుంటున్నా. ధోని సార్ దిగ్గజం.. ఆయన్ని అలాగే ఉండనివ్వాలి” అని జురెల్ చెప్పాడు.
తాను ఎప్పుడూ టెస్టు ఫార్మాట్లో ఆడాలనే కోరుకున్నానని.. ఆ అవకాశం చాలా త్వరగా దక్కిందని జురెల్ పేర్కొన్నాడు. ”సుదీర్ఘ ఫార్మాట్లో ఆడాలని ఎప్పుడూ అనుకునేవాడిని. భారత్ తరఫున 200 టెస్టులు ఆడాలని భావించేవాడిని. కానీ ఆ తర్వాత అర్థమైంది అది చాలా చాలా కష్టమని. నాన్న సైన్యంలో ఉండడంతో నన్ను కూడా అదే రంగంలోకి వెళ్లాలని అనుకున్నారు. జాతీయ డిఫెన్స్ అకాడమీ పరీక్షలకు సిద్ధం కావాలని చెప్పారు. కానీ క్రికెట్‌ను ఇష్టపడ్డా. నాన్నను ఒప్పించి ఆటలో కొనసాగా” అని జురెల్ చెప్పాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన నేపథ్యంలో జురెల్‌ను సన్నీ పొగడ్తలతో ముంచెత్తాడు. జురెల్ మరో ధోనిలా కనిపిస్తున్నాడని అన్నాడు.