ఐపీఎల్ అనంతరం భారత ఆటగాళ్లు మహా సమరంలో తలపడనున్నారు. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. జూన్ 2న మొదలుకానున్న ఈ మెగాటోర్నీ అదే నెల 29న ముగుస్తోంది. వన్డే ప్రపంచకప్ తృటిలో చేజార్చుకున్న టీమిండియా ఈ సారి కప్‌ను సాధించాలనే కసితో రగిలిపోతుంది.
భారత్ విశ్వవిజేతగా నిలవాలని బీసీసీఐ తీవ్రంగా కృషి చేస్తోంది. పటిష్టమైన జట్టును ఎంపిక చేయాలని సెలక్టర్లకు కీలక సూచనలు చేసింది. అంతేగాక భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయాలను స్వాగతిస్తోంది. వాళ్ల ఆలోచనలు పరిగణనలోకి తీసుకుంటూ చర్యలు చేపడుతోంది. అయితే వరల్డ్ కప్ ముందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోనుందని తెలుస్తోంది.
మహేంద్ర సింగ్ ధోనీని తిరిగి టీమిండియాతో చేర్చాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆటగాడిగా కాకుండా మెంటార్‌గా ధోనీకి బాధ్యతలు అందివ్వాలని చూస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ధోనీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే భారత జట్టుకు అదనపు బలం చేకూరుతుందని భావిస్తోంది. దుబాయ్ వేదికగా జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
కానీ ఆ మెగాటోర్నీలో భారత్ సత్తాచాటలేకపోయింది. సెమీఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ దశలొనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ధోనీ తిరిగి మెంటార్ బాధ్యతలు ఒప్పుకుంటాడా అనేది అసలు ప్రశ్న. మరోవైపు ధోనీని టీమిండియాతో చేర్చాలని బీసీసీఐ తీవ్రంగా ప్రయత్నించడానికి ప్రపంచకప్‌తో పాటు మరో కారణం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు ముగిసిన అనంతరం ధోనీకి అప్పగించాలని చూస్తోందని తెలుస్తోంది.
దానికి ధోనీ ఒప్పుకోకపోతే మెంటార్‌గా జట్టుతో కొనసాగించి భవిష్యత్‌లో కోచ్ బాధ్యతలు అందివ్వాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోందని సమాచారం. ద్రవిడ్ అనంతరం వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా ఎంపిక చేసి ధోనీని ఓ పదవితో జట్టుతో కొనసాగించడమే బీసీసీఐ ప్రణాళిక అని వార్తలు వస్తున్నాయి.