ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. హైదరాబాద్, చెన్నై టీమ్స్ తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవడంతో.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఈరోజు నుంచి సన్నద్ధం కానున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హైదరాబాద్‌కు వచ్చాడు. విశాఖ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో ధోనీని చూసిన అభిమానులు పెద్దగా కేకలు వేశారు. మహీని కలవాలని కొందరు ప్రయత్నించగా సెక్యూరిటీ అడ్డుకోవడంతో వారికి నిరాశ తప్పలేదు. ధోనీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కూడా సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు.
మరోవైపు అహ్మదాబాద్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ కూడా హైదరాబాద్‌కు వచ్చారు. ఈరోజు నుంచి ఉప్పల్ మైదానంలో ఇరు జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్‌ను చూసేందుకు ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటు హోమ్ టీమ్ కావడం, అటు ఎంఎస్ ధోనీ ఉండడంతో ఫాన్స్ టికెట్స్ కోసం ఎగబడుతున్నారు. ఏప్రిల్ 5న ఉప్పల్ స్టేడియం మొత్తం అభిమానుల అరుపులు, కేకలతో దద్దరిల్లనుంది.