భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చివరిదైన ధర్మశాల టెస్టు మ్యాచ్ రేపు ఆరంభం కానుంది. ఇప్పటికే 3-1 తేడాతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ ఈ మ్యాచ్‌లోనూ గెలిచిన ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్’లో పాయింట్లను మరింత మెరుగుపరచుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి ఇండియా ఆధిక్యాన్ని తగ్గించాలని ఇంగ్లండ్ జట్టు పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ కీలక బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ధర్మశాల పిచ్‌ను రంజీ ట్రోఫీ కోసం ఉపయోగించారని, ఆ పిచ్‌పై మ్యాచ్ జరగబోతోందని జానీ బెయిర్‌స్టో అన్నాడు. ‘‘గత నెలలో జరిగిన రంజీ ట్రోఫీలో ఉపయోగించిన పిచ్ ఇది. ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా గ్రౌండ్ స్టాఫ్ అద్భుతంగా పనిచేశారు. మేము ఇక్కడే ఉండి గమనించాం. అవుట్‌ఫీల్డ్‌ను చక్కగా రూపొందించారు. చాలా బాగుంది. ప్రపంచంలో సుందరమైన క్రికెట్ మైదానాలలో ఇదొకటి’’ అని బెయిర్‌స్టో అన్నాడు.
వంద టెస్టులు ఆడటం నరకమే..
టెస్ట్ కెరియర్‌లో 100వ మ్యాచ్ ఆడబోతున్న సందర్భంగా ధర్మశాలలో మీడియాతో బెయిర్‌స్టో మాట్లాడుతూ,. 100 టెస్టులు ఆడడం అంటే నరకం లాంటిదని వ్యాఖ్యానించాడు.కాగా భారత్, ఇంగ్లండ్ మధ్య మార్చి 7న (గురువారం) 5వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో జానీ బెయిర్‌స్టో ఘోరంగా విఫలమైనప్పటికీ 5వ టెస్టు మ్యాచ్‌లో అతడికి చోటు ఖాయమైంది. ఈ విషయాన్ని ఆ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ధ్రువీకరించాడు. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ ఆ తర్వాత వరుసగా మూడు టెస్టుల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే.